ఎంపీ మెజార్టీ తగ్గిందని మేయర్ ను తొలగించారు!
కోయంబత్తూర్: రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదవుండదనే నానుడి మరోసారి రుజువైంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఏఐఏ డీఎంకే పార్టీ అభ్యర్థికి ఆధిక్యం తగ్గిందని ఆగ్రహించిన తమిళనాడు ప్రభుత్వం అందుకు ఒక మేయర్ ను దారుణంగా తొలగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి సహకరించలేదనే కారణంగా కోయంబత్తూర్ మేయర్ గా ఉన్న వేలుసామిపై జయలలిత ప్రభుత్వం ఆకస్మిక వేటు వేసింది. ఇందుకు ప్రధాన కారణం ఏఐఏడీఎంకే లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి 40 వేల మెజర్టీ గెలిచిన పి.నాగరాజన్.
తన గెలుపుకు వేలుసామి కృషి చేయలేదని.. అతనిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో వేలుసామిపై చర్యలకు ఆగమేఘాలపై శ్రీకారం చుట్టింది జయ ప్రభుత్వం. ఇక మేయర్ పీఠం నుంచి దిగిపోవాల్సిందే నంటూ హుకుం జారీ చేసింది. ఇక చేసేది లేక వేలుసామి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు రాజీనామ లేఖను నగర్ కమీషనర్ జి.లతకు అందజేశారు. ఈ మేరకు మాట్లాడిన ఆమె.. వేలుసామి రాజీనామా లేఖ అందిందని, త్వరలో కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో కొత్త మేయర్ ను ఎన్నుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అంతవరకూ ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా ఉన్న లీలావతి ఇంఛార్జి బాధ్యతలు తీసుకుంటుదన్నారు.