మరో ‘అమ్మ’ పథకం
చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే పాలనతోనేగాక, ‘అమ్మ పథకాల’ పేరుతో మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు జయలలిత ప్రభుత్వం మరో అమ్మ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు రూ.1000 విలువైన ‘అమ్మ’ బేబీకేర్ కిట్‌ను బహుమతిగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం నాటి అసెంబ్లీలో ప్రకటించారు. నిరక్షరాస్యులు, పేద ప్రజలుకొందరు ఇంటి వద్దనే మంత్రసాని పర్యవేక్షణలో ప్రసవాలను సాగిస్తుంటారు. ఈ విధానం ఎంతో ప్రమాదకరమని తెలిసినా ఆస్పత్రి ప్రసవాలకు నేటికీ మొగ్గుచూపడం లేదు.
సాధారణ ప్రసవాన్ని సైతం డాక్టర్లు సిజేరియన్‌గా మార్చేస్తారనే దురభిప్రాయం కొందరి ప్రజల్లో నాటుకుని పోవడమే ఇందుకు ప్రధాన కారణమని భావించవచ్చు. ఆస్పత్రి ప్రసవాలపై ప్రభుత్వాలు ఎంతగానో ప్రచారం చేసినా ఇంకా ఎంతో కొంత శాతం ఇళ్లవద్దనే సాగుతున్నాయి. ప్రజల్లో పూర్తిస్థాయి మార్పు తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రుల్లో ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవిస్తే తల్లీ, బిడ్డలకు అవసరమైన 16 రకాల వస్తువులను ఉచితంగా పొందవచ్చని సీఎం తెలిపారు. ఈ వస్తువులన్నీ ప్రధానంగా పసిబిడ్డకు అవసరమ్యే వస్తువులతో అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
పసవానంతరం తల్లికి సౌభాగ్య లేహ్యం, బిడ్డకు అవసరమయ్యే టవల్, జీరోసైజ్ దుస్తులు, పరుపు, వల, నాప్‌కిన్స్,100 మిల్లీలీటర్ల నూనెడబ్బా, 60 మిల్లీ షాంపు ప్యాకెట్లు, సోప్ బాక్స్, చెప్పులు, నెరుుల్ కటర్, బిడ్డను ఆడించేందుకు మెుత్తని బొమ్మ, చేతిని శుభ్రం చేసుకునే ఆయిల్, ఇలా రూ.1000 విలువ చేసే 16 వస్తువులు ఈ కిట్‌లో పొందుపరుస్తారు. దీంతోపాటు ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రూ.2 70 కోట్లతో అత్యవసర చికిత్సా విభాగాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల సహాయంతో డయాలసిస్ సౌకర్యాన్ని సైతం ప్రవేశపెడుతున్నట్లు ఆమె చెప్పారు.
అమ్మ క్యాంటీన్లలో అదనపు సౌకర్యాలు
అమ్మ క్యాంటీన్లకు అనుబంధంగా అదనపు సౌకర్యాలను కల్పించనున్నారు. అమ్మ క్యాంటీన్ల సముదాయంలో విశ్రాంతి గృహాలను సైతం నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. చెన్నైతోపాటూ ఐదు జిల్లాల్లో ఈపథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రధానంగా బేల్దారి కూలీలను దృష్టిలో ఉంచుకుని ఈ విశ్రాంతి గృహాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రూ.3.87 కోట్లతో 106 దేవాలయాల్లో అన్నదాన పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, రూ.50 కోట్లతో తిరువన్నామలై, రామేశ్వరంలలోని దేవాలయాల్లో భక్తులకు వసతి గృహాలను నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు.