మళ్లీ నేనే సీఎం
సమరశంఖం పూరించండి
కార్యకర్తలకు దిశానిర్దేశం
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పిలుపు
చెన్నై : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలంతా సంఘటిత శక్తిగా మారాలని అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 99వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి జయలలిత కార్యకర్తలకు శనివారం ఉత్తరాల ద్వారా సందేశం పంపారు.
తమిళరాజకీయ, సినిమా రంగాల్లో దేదీప్యమానంగా వెలిగిన ఎంజీ రామచంద్రన్‌కు నూరేళ్ల జయంతి వేడుకలు సమీపిస్తున్నా ప్రజలు నేటికీ మరిచిపోలేదని అన్నారు. రాజకీయ, సినీరంగాల్లో ఆయన సాగించిన కఠోరపరిశ్రమనే ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి కారణమని అన్నారు. ఎంజీఆర్ జీవితం మరెన్నో తరాలకు మార్గదర్శకమని ఆమె అన్నారు. ప్రజల కోసం తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపిన మహానేతగా ఆమె ఎంజీఆర్ ని కొనియాడారు.
ప్రజాజీవితంలో తనను ప్రియమైన సోదరిగా భావించేవారని ఆమె తెలిపారు. రెండెంకెల జయంతి వేడుకలు ఈ ఏడాదికి ఇదే ఆఖరని, వచ్చే ఏడాది శతవసంతాల సంబరాలను జరుపుకుంటున్నామని తెలిపారు. తన నేతృత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని చేపట్టడతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎంజీఆర్ నూరేళ్ల జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోష దాయకమని చెప్పారు. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల కోసం గతంలో ఎన్నడూ సాధించని అపూర్వమైన విజయాన్ని పార్టీ సొంతం చేసుకునేలా కార్యకర్తలు పాటుపడాలని ఆమె కోరారు.
ప్రతి కుటుంబానికి అందేలా అమలుచేసిన అభివృద్ధి పథకాలే అన్నాడీఎంకేకు విజయసోపానాలుగా భావించాలని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ మెజార్టీతో గెలుపొందడం, తన నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జయలలిత ధీమా వ్యక్తం చేశారు.
రూ.88 కోట్ల పథకాల ప్రారంభోత్సవాలు:
ఇదిలా ఉండగా, సీఎం జయలలిత రాష్ట్రంలో చేపట్టిన రూ.88 కోట్ల విలువైన పథకాలకు, నిర్మాణాలకు శనివారం ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లోని సహకార సంఘాల గిడ్డంగులు, అమ్మ ఫార్మసీలు, ఫలసరకుల దుకాణాలను వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ఆమె ప్రారంభించారు.