
నెంబర్‌వన్ అజిత్
అజితే నెంబర్‌వన్. ఈ ఒక్క మాట చాలు ఆయన అభిమానులు కాలరెగరవేయడానికీ, ఆనందంతో రెచ్చిపోవడానికి. అంతే కాదు తాజా సర్వేలో అజిత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌నే మించిపోయారట. ఇక అజిత్ అభిమానుల ఆనందానికి అవధులేముంటాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే చెన్నై స్థానిక లయోలా కళాశాల విద్యార్థుల బృందం ఆ కళాశాల ప్రొఫెసర్ రాజనాయగం నేతృత్వంలో కాబోయే ముఖ్యమంత్రి, తదితర అంశాలపై ఈ నెల ఏడో తేదీ నుంచి 19వ తారీఖు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో నెంబర్‌ఒన్ నటుడెవరన్న అంశం కూడా చోటు చేసుకుంది. కాగా ఆ సర్వే ప్రకారం నెంబర్‌ఒన్ పోటీలో నటుడు అజిత్‌కు 16 శాతం, రజనీకాంత్‌కు 15.9 శాతం, విజయ్‌కు 9 శాతం, కమలహాసన్‌కు 5.9 శాతం, సూర్యకు 4.3 శాతం మద్దతు లభించినట్లు తెలిసింది.
ప్రజా సర్వేలో అధిక శాతం అజిత్‌నే నెంబర్‌ఒన్ హీరోగా పేర్కొనడం విశేషం. కాగా రజనీకాంత్‌కు పోటీగా భావించే కమలహాసన్ నాలుగో స్థానంలో ఉండడం, అజిత్‌కు పోటీగా భావించే విజయ్‌కు మూడో స్థానాన్ని తమిళ ప్రజలు కట్టబెట్టడం గమనార్హం. ఇక నటుడు సూర్య 4.3 శాతానికే పరిమితం అయినట్లు ఆ సర్వే పేర్కొంది. అయితే ఈ సర్వేపై ఒక్కొకరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.