రంకెలేసిన తంబి | Alanganallur jallikattu will be held as per people's wish: Tamil Nadu CM O Panneerselvam | Sakshi
Sakshi News home page

రంకెలేసిన తంబి

Published Mon, Jan 23 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

Alanganallur jallikattu will be held as per people's wish: Tamil Nadu CM O Panneerselvam

►  ఓ పక్క నిరసన..మరోపక్క రంకెలేసిన బసవన్న
►  తెరుచుకున్న వాడి వాసల్‌
►  తిరుచ్చి, పుదుకోట్టైలలో జల్లికట్టు జోరు
►  పుదుకోట్టైలో ఇద్దరి బలి
►  అలంగానల్లూరులో సీఎంకు వ్యతిరేకత
► పోటెత్తిన మెరీనా తీరం


నిషేధపు కట్లు తెంచుకున్నా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా జల్లికట్టు విషయంలో తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. శాశ్వత పరిష్కార నినాదం మిన్నంటింది.  అత్యవసర ఆర్డినెన్స్ తో ఆదివారం కొన్నిచోట్ల  బసవన్నలు  రంకెలే శాయి. మరెన్నో చోట్ల వ్యతిరేకత తప్పలేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.  సీఎం పన్నీరు సెల్వం వెనుదిరగాల్సి వచ్చింది. పుదుకోట్టైలో నిర్వహించిన సాహసక్రీడలో రంకెలేసిన ఎద్దుల దాడిలోఇద్దరు క్రీడాకారులు బలి అయ్యారు.

సాక్షి, చెన్నై :    తమిళుల సాహస, సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు పట్టు బడుతూ సాగుతున్న నిరసనల గురించి తెలిసిందే. మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుతూ శనివారం అత్యవసరంగా ఆర్డినెన్స్  తీసుకొచ్చినా తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. కంటి తుడుపుచర్యతో మాకేంటి, శాశ్వత పరిష్కారం లక్ష్యం అంటూ జల్లికట్టు మద్దతు ఉద్యమాన్ని కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. సెలవు రోజున  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తినా, ఎక్కడికక్కడ బలగాల్ని మోహరింప చేస్తుండడం గమనార్హం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగి తీరుతామని మద్దతుదారులు ప్రకటించడం విశేషం. ఇక, ఆర్డినెన్స్ తో ఆదివారం జల్లికట్టుకు శ్రీకారం చుట్టి తీరుతానంటూ ముందుకు సాగిన సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులకు వ్య తిరేకత తప్పలేదు. అలంగానల్లూరులో సీఎం పన్నీరు సెల్వం  పాచికలు పారలేదు. అన్ని చో ట్ల వాడి వాసల్‌ తెరచుకున్నా, కొన్ని చోట్ల మా త్రమే బసవన్నలు రంకెలేస్తూ దూసుకొచ్చాయి.

అటు ఆట : నిషేధపు కట్లు తెంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో దక్షిణాదిలోని జల్లికట్టుకు పేరు గడించిన తిరుచ్చి, మదురై, దిండుగల్, శివగంగై జిల్లాల్లో, డెల్టా పరిధిలోని తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లో జల్లికట్టుకు, పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నామక్కల్‌లలో రెక్లాతో ఎడ్ల  పందేలకు చర్యలు తీసుకున్నారు. ఆటకు తగ్గ అన్ని ఏర్పాట్లతో ముందుకు సాగినా, వ్యతిరేకత మాత్రం తప్పలేదు. తిరుచ్చి మనప్పారైలో మూడు, నాలుగు రోజులుగా నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, కట్లు తెంచుకోవడంతో ఆదివారం మరింత ఉత్సాహంతో జల్లికట్టులో ఎద్దులతో కలిసి క్రీడాకారులు రంకెలు వేస్తూ తమ సత్తాను చాటుకున్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను నిర్వాహకులు అందజేశారు. 

పుదుకోట్టైలోని ఇలుపురు సమీపంలోని రాపూసల్‌ గ్రామంలో జల్లికట్టును మంత్రులు విజయభాస్కర్, పాండియరాజన్  ప్రారంభించారు. వాడివాసల్‌ నుంచి ఎద్దులు దూసుకొచ్చాయి. ఉత్సాహంగా, ఆనందోత్సాహాలతో జల్లికట్టు సాగింది. అయితే, ఎద్దుల్ని పట్టుకునే క్రమంలో లక్ష్మణ పట్టికిచెందిన మోహన్, ఉడుక్కురుకు చెదిన రాజా అనే క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇదే ప్రాంతంలో మరో యాభై మంది స్వల్పం గా గాయపడ్డారు. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేయడంతోనే భద్రత కరువైందని, పాలకుల తీరుతో   ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయని సహచర క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

ఇక,  రామనాథపురంలో నామ్‌ తమిళర్‌ కట్చి నేతృత్వంలో రెండు రోజులుగా జల్లికట్టు సాగినా, ఆదివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎద్దులు దూసుకొచ్చాయి. ఇక, కోయంబత్తూరు కొడీస్సియా మైదానంలో రెక్లా పోటీలను మంత్రి ఎస్‌పీ వేలుమణి జెండా ఊపి ప్రారంభించారు. తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలైలో రెక్లా పోటీలను మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్  జెండా ఊపి ప్రారంభించారు.   రెక్లా పోటీలకు వచ్చిన మంత్రులకు జల్లికట్టు మద్దతు దారుల సెగ తగిలింది. వారిని బుజ్జగించి బయట పడేలోపు మంత్రులకు ముచ్చెమటలు తప్పలేదు.

ఇటు పట్టు : జల్లికట్టుకు ప్రసిద్ది గాంచిన అలంగానల్లూరులో ‘ఆట’కు శ్రీకారం చుట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే సాగాయి. శాశ్వత పరిష్కారం నినాదంతో వాడివాసల్‌ వైపుగా ఏ ఒక్కర్నీ యువత, గ్రామస్తులు, మద్దతుదారులు వెళ్లనివ్వ లేదు. జల్లికట్టుకు జెండా ఊపుతానంటూ మదురైకు రాత్రికి రాత్రే పరుగులు తీసిన సీఎం పన్నీరుసెల్వం నిరాశతో వెనుదిరగక తప్పలేదు. జోరు వాన కురిసినా మద్దతుదారులు ఏ మాత్రం వెనక్కు తగ్గని దృష్ట్యా, ఆగమేఘాలపై జల్లికట్టు నిర్వాహకుల్ని పిలిపించి బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఫలితం శూన్యం.

వాడివాసల్‌ తెరిచే ఉందని, ప్రజలు ఎప్పుడు కోరితే, అప్పుడు జల్లికట్టుకు సిద్ధమని మదురై జిల్లా కలెక్టర్‌ వీరరాఘవులు ప్రకటించారు. దిండుగల్‌ జిల్లా నత్తం, సాత్తూరు, సేలం ఆత్తూరు, తంజావూరులో జల్లికట్టుకు ఏర్పాట్లు సాగినా, వ్యతిరేకతతో రద్దు చేసుకోక తప్పలేదు. ఇక, జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతుగా సెలవు రోజు పెద్ద ఎత్తున జన సమూహం తోడు కావడం విశేషం. ఈరోడ్‌లోని వీరప్పన్  పాళయంలో బీజేపీ నేతృత్వంలో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీ శాయి. యువత తిరగ బడడంతో, ఓ సందర్భంలో రాళ్లు రువ్వడంతో అక్కడికి వచ్చిన అధికారులు, బీజేపీ వర్గాలు పరుగులు తీశారు. మదురై మేలూరులో వర్షంలోనూ నిరసన కొనసాగగా, రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు మద్దతు ఉద్యమంలో శాశ్వత పరిష్కారం నినాదం మిన్నంటింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా స్పం దించిన జంతు సంరక్షకుడు రాధా రాజన్  ఇరకాటంలో పడ్డారు. బీసెంట్‌నగర్‌లోని ఆయన ఇంటిని డీఎండీకే వర్గాలు ముట్టడించాయి.

ఇదే శాశ్వతం : అలంగానల్లూరులో జల్లికట్టుకు జెండా ఊపేందుకు వెళ్లి నిరాశతో చెన్నైకు చేరుకున్న సీఎం పన్నీరు సెల్వం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రూపొందించిన ఆర్డినెన్స్  శాశ్వతం అని, ఇది తాత్కాళికం మాత్రం కాదు అని స్పష్టం చేశారు. అన్ని చోట్ల వాడివాసల్‌ తెరచుకుందని, జల్లికట్టుకు అనుమతుల్ని కలెక్టర్లు ఇస్తున్నారని, జిల్లాల ఎస్పీలు భద్రతను కల్పిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చట్ట, నిబంధనలమేరకు ముందుకు సాగుతోందని, ఆర్డినెన్స్ కు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి , రాష్ట్రపతి ఆమోదం పొంది తీరుతామని స్పష్టం చేశారు.

అత్యవసరంగా తీసుకొచ్చిన చట్టానికి చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ నియమ నిబంధనలు సిద్ధం అయ్యాయని, ప్రభుత్వ గెజిట్‌లో అన్ని వివరాలను ప్రకటించామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టు మద్దతుదారులు ఎందుకు ఏకీభవించడం లేదన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ› ఆ కారణం ఏమిటో మీకే తెలుసు అంటూ పన్నీరు ముందుకు సాగారు. ఇక, ఆర్డినెన్స్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాని రీతిలో సుప్రీంకోర్టులో  కేవియేట్‌ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఉండడం ఆహ్వానించ దగ్గ విషయం.

సరైన వివరణ ఇవ్వండి : జల్లికట్టు కోసం ప్రత్యేకంగా అత్యవసర ఆర్డినెన్స్  తీసుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్  పేర్కొన్నారు. ఈ పని ముందే చేసి ఉంటే, ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చి ఉండేది కాదన్నారు. అయితే, ఇదే శాశ్వతం అని ప్రకటనలు చేయడం కాదు అని, ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ పూర్తి వివరణను సీఎం పన్నీరుసెల్వం జల్లికట్టు మద్దతు దారులుకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా మద్దతుదారుల వద్దకు సీఎం వెళ్లాలని సూచించారు. గతంలో జల్లికట్టు విషయంగా సాగిన నాటకీయ నిర్ణయాలతోనే ప్రస్తుతం, ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టుమద్దతు దారులు ఏకీభవించడం లేదన్న విషయాన్ని సీఎం గుర్తెరగాలని హితవు పలికారు.

జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా నినాదం మిన్నంటింది. ఆదివారం ఎక్కడిక్కడ ఆందోళనలు సాగాయి. చెన్నై మెరీనా తీరంలో జన సందోహం పోటెత్తింది. యువత, విద్యార్ధులు ఆందోళనల బాటలో ఉదృ్ధతంగా దూసుకెళ్తుండడంతో సోమవారం నుంచి కళాశాలలు, పాఠశాలలు తెరచుకోనున్నడం గమనార్హం.

దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు  
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నమ్మకాన్ని కలిగించేలా ఉన్నాయి. మార్చి 31వరకు సంయమనం పాటిద్దాం. అంతవరకు ఉద్యమాన్ని వాయిదా వేద్దామంటూ ఆదివారం రాత్రి 10గంటల సమయంలో జల్లికట్టు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన నిర్వాహకులు చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ నిర్వాహకులు చెన్నై ప్రెస్‌క్లబ్‌ వేదికగా ఈ ప్రకటన చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెనకేసుకొచ్చే రీతిలో ఉండడం గమనార్హం. అదే సమయంలో వీరి చర్యలను తప్పుబట్టేవారు తెరమీదకు వస్తున్నారు. దీంతో జల్లికట్టు ఉద్యమం సోమవారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. కొందరు విద్యార్థులయితే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని మెరీనాతీరంలో బైఠాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement