
తిరుమలలో పోలీసులపై బండబూతులు
తిరుపతి: తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బంధువులమంటూ కొందరు రెచ్చిపోయారు. పోలీసులను సైతం వారు లెక్క చేయలేదు. ఒక వ్యక్తి అయితే.. 'నేను జడ్జీ కుమారుడిని. నన్ను నడిచి వెళ్లమంటావా' అంటూ పోలీసుల మీదకుపోయి వారిపై చేయి చేసుకునేంత పని చేశారు. ఇంకా చెప్పాలంటే గుండాగిరికి దిగి అనకూడని మాటలు అన్నారు. కానిస్టేబుల్‌ను దుర్భాషలాడటంతోపాటు సీఐని కూడా తోసేశారు. 'నువ్వేమన్న చేయగలవా.. మేం ఎవరో తెలుసా' అంటూ సినిమా డైలాగ్‌లు పేల్చారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిని రికార్డు చేస్తున్న మీడియావాళ్లను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టారు.
వివరాల్లోకి వెళితే.. ముక్కోటి ఏకాదశి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్బంగా శంకుమెట్ట సర్కిల్ వద్ద ట్రాఫిక్‌ను పక్కకు మళ్లించారు. ఇంతలో ఓ కారులో వచ్చిన వ్యక్తులు తాము చైర్మన్ బంధువులం అని, తమను వెళ్లనివ్వాలని, జేఈని కలవాలని అడిగారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున కారును పక్కు పార్కింగ్ చేసి నడిచి వెళ్లండని అన్నారు. దాంతో వారంతా ఇక దౌర్జన్యానికి దిగారు. వరప్రసాద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడారు. అది చూసి సీఐ శ్రీనివాసులు వెళ్లగా ఆయనపైకి కూడా దూసుకెళ్లారు. అంతుచూస్తామంటూ పెచ్చరిల్లిపోయారు.
ఈ సంఘటన అనంతరం మీడియాతో సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ 'ఓ నలుగురు వ్యక్తులు టీటీడీ చైర్మన్ బంధువులమంటూ వచ్చారు. పార్కింగ్ చేసి వెళ్లమన్నందుకు దుర్భాషలాడారు. మా కానిస్టేబుల్‌ను తిడుతుంటే నేను వెళ్లగా.. నువ్వేం చేస్తావ్ అంటూ తోసేశారు. ఈ విషయం డీఎస్పీకి చెప్పగా నేను మాట్లాడుతానులే అని చెప్పి పంపించేశారు' అని చెప్పారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందిస్తూ 'నేను జడ్జీ కొడుకును నడిచి పోవాలా అంటూ ఒకతను మీదకొచ్చాడు. నలుగురైదుగురు కొట్టబోయారు.. ఎవరు ఆపినా వారు ఆగలేదు' అని చెప్పాడు.