న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఇక్కట్లు తీరేలా లేవు. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు, కుమార్‌విశ్వాస్‌కు మధ్య ఇంకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమానతుల్లా పోస్టర్‌తో ఇద్దరి మధ్య వైరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమానతుల్లాను విధాన సభ కమిటీల్లో చాలా వాటిలో సభ్యున్ని, చైర్మన్‌ను చేసినందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అభివాదాలు తెలుపుతూ ఆప్ కార్యాలయంలో పోస్టర్లు వెలిశాయి. జోహరీ హీ కర్తా హై హీరోంకా పహచాన్ (రత్నాల వ్యాపారే వజ్రాలను గుర్తిస్తాడు) అంటూ ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లాను కేజ్రీవాల్‌కు అత్యంత ప్రియమైన ఎమ్మెల్యేగా ఈ పోస్టర్లు పేర్కొన్నాయి.
అమానతుల్లా పోస్టర్లను శనివారం ఉదయం అతికించారు. రాజస్థాన్ ఇన్‌చార్జి హోదాలో కుమార్ విశ్వాస్ ఆప్ కార్యాలయంలో తొలి సమావేశం శనివారం జరుపనుండగా ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల గురించి టీవీ చానెళ్లలో వార్తలు రావడంతో కుమార్ విశ్వాస్ ఆప్ కార్యాలయానికి రాకమునుపే వాటిని తొలగించారు. దీనిపై అమానుతుల్లా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా అమానుతుల్లా పోస్టర్లను ఎలా తొలగిస్తారంటూ ఆప్ కార్యాలయ సిబ్బందిపై మండిపడ్డారు. దీనిపై సీఎం కేజ్రీవాల్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కుమార్‌విశ్వాస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమానుతుల్లా అనుచరులు ఆరోపించారు. ఈ పోస్టర్లపై కుమార్ విశ్వాస్‌ను ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఆ సంగతే తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
ఎమ్సీడీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తరువాత కుమార్ విశ్వాస్‌ను ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్‌గా అమానతుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఆప్‌ను అధికారం నుంచి దించేందుకు కుమార్ విశ్వాస్ బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఆగ్రహించిన కుమార్ విశ్వాస్‌ను మెప్పించడం కోసం అమానతుల్లాను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
‘ఆప్’లో పోస్టర్ పోరు
Published Sat, Jun 10 2017 8:04 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
Advertisement
Advertisement