నేడు అమిత్‌షా రాక
ఒకే రోజు ..నాలుగు సభలు
రేపు సోనియా రాక ఏడున రాహుల్
స్టార్ హోదా
తమిళనాట ఓట్ల వేట లక్ష్యంగా సుడిగాలి పర్యటనకు జాతీయ పార్టీల పెద్దలు సిద్ధమయ్యారు. బుధవారం రాష్ట్రంలో నాలుగు చోట్ల బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యక్షం కానున్నారు. గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ చెన్నై బహిరంగ సభకు పరిమితం కానున్నారు. ఏడో తేదీన మదురై, కోయంబత్తూరులలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
చెన్నై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడియలు సమీపిస్తున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెలువడడంతో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు, కూటమి పార్టీల్లోని మిత్రులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ప్రచారంలో దూసుకెళుతున్నారు.
ఇన్నాళ్లు చడి చప్పుడు లేకుండా ఉన్న వాతావరణం, ప్రస్తుతం మిన్నంటుతున్నది. అభ్యర్థుల ప్రచార సమరం హోరెత్తుతుండడంతో సుడిగాలి పర్యటనలకు జాతీయ స్థాయి పెద్దలు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, డీఎంకే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంలతో పాటుగా, సీపీఎం, సీపీఐ జాతీయ పెద్దలు తమిళనాడు వైపు పరుగులు తీయడానికి సిద్ధమయ్యారు. వీరి ప్రచారాలు ఆగమేఘాలపై సుడిగాలి రూపంలో సాగబోతున్నాయి.
నేడు అమిత్ షా : అధికారం మాట పక్కన పెట్టి, ప్రతినిధి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో కమలనాథులు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆరు లేదా, ఎనిమిదో తేదీల్లో ఆయన పర్యటన సాగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్ర మంత్రులు పలువురు రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నారు. ఇక, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓమారు తిరుచ్చి సభలో ప్రత్యక్షం అయ్యారు. తదుపరి బుధవారం సుడిగాలి పర్యటనకు అమిత్ షా సిద్ధం అయ్యారు.
ఒకే రోజు ఆయన నాలుగు బహిరంగ సభల్లో ప్రత్యక్షం కాబోతున్నారు. ఉదయం పదిన్నర గంటలకు పుదుకోట్టైలోనూ, రెండున్నర గంటలకు తిరునల్వేలి జిల్లా తెన్‌కాశిలో, నాలుగున్నర, ఐదు గంటల మధ్యలో కన్యాకుమారి జిల్లా నాగుర్ కోవిల్‌లో, రాత్రి ఏడున్నర గంటల మధ్యలో మదురైలో జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేయనున్నారు. అమిత్ షా ఒక్క రోజు పర్యటనలో జరగనున్న నాలుగు బహిరంగ సభల్ని విజయవంతం చేయడానికి కమలనాథులు సర్వం సిద్ధం చేసి ఉన్నారు.
రేపు సోనియా రాక: డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఓట్ల వేటకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధమయ్యారు. గురువారం చెన్నైలో ఆమె పర్యటన సాగనున్నది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, సోనియాగాంధీ ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఓటర్లకు పిలుపు నివ్వబోతున్నారు. ఇందు కోసం ఐలాండ్ గ్రౌండ్‌లో వేదిక సిద్ధం అవుతున్నది. భారీ జనసమీకరణ దిశగా కాంగ్రెస్ వర్గాలు పరుగులు తీస్తున్నాయి. సోనియా రాకతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఎస్‌జీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై పరిశీలన జరిపారు. కొన్ని మార్పులు చేర్పులకు తగ్గ సూచనల్ని స్థానిక అధికారులకు చేశారు. సోనియా తదుపరి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ర్టంలో పర్యటించనున్నారు. ఏడో తేదీన మదురై, కోయంబత్తూరులలో ఆయన పర్యటన సాగనుంది. ఉదయం మదురైలో జరిగే బహిరంగ సభతో కూటమి అభ్యర్థులను పరిచయం చేయనున్నారు.
సాయంత్రం కోయంబత్తూరు కొడీస్సీయ మైదానంలో జరిగే బహిరంగ సభకు రాహుల్ హాజరవుతారు. ఈ వేదికపై రాహుల్ గాంధీతో పాటుగా డీఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి ప్రత్యక్షం కాబోతున్నారు. ఈ పర్యటన తదుపరి పదమూడు తేదీన దక్షిణ తమిళనాడులో తమ అభ్యర్థులు బరిలో ఉన్న ప్రాంతాల్ని గురి పెట్టి రాహుల్ రోడ్ షోకు సిద్ధం అవుతున్నారు. ప్రచార సమరం వేడెక్కడంతో కాంగ్రెస్ గ్రూపు నేతలు సైతం రంగంలోకి దిగనున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, నటి,అధికార ప్రతినిధి కుష్బు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తోండగా, ఇక కేంద్రమాజీ మంత్రి చిదంబరం, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్, తమాకా నుంచి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన పీటర్ అల్ఫోన్స్, విశ్వనాథన్ వంటి వాళ్లను స్టార్ వ్యాఖ్యాతలుగా ప్రకటించి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇవ్వడం విశేషం.