tamilnadu election campaign
-
అమ్మకే పవర్ కట్
చెన్నై: రాష్ట్రంలో సంపూర్ణ విద్యు త్ లక్ష్యం..! కాదు..కాదు.. మిగులు విద్యుత్.!. విద్యుత్ కోతల రహిత రాష్ట్రం మనదే..! అన్న నినాదంతో ముందుకు సాగుతున్న ‘అమ్మ’జయలలితకే పవర్ కట్ అంటే ఎలా ఉంటుందో విద్యుత్ శాఖ వర్గాలు రుచి చూపించాయట..!. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ కట్ ఎందరి ఉద్యోగాలకు ఎసరు పెట్టనుందో. రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేవు అని, సంపూర్ణ విద్యుత్ అందుతున్నదని, త్వరలో మిగులు విద్యుత్‌ను చూడబోతున్నారంటూ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదే పదే ఎన్నికల ప్రచారంలో తన ప్రచారాస్త్రంగా నినదిస్తున్నారు. పాలకులు ఓ రకం వ్యాఖ్యలు చేస్తుంటే, మరో వైపు విద్యుత్ శాఖ వర్గాలు తమ పనితనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో అనధికారికంగా అక్కడక్కడ కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇవన్నీ అమ్మకు మాత్రం తెలియదని సమాచారం. అందుకే కోతలంటే ఎలా ఉంటాయో అమ్మకు తెలిపినట్టున్నారు. ఆర్కేనగర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్న అమ్మ జయలలిత శుక్రవారం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలతో దూసుకెళ్లారు. అలా...అమ్మ పయనంలో సున్నాం కాలువ నుంచి మనలి రోడ్డు వైపుగా వీధి దీపాలన్నీ వెలగకపోవడంతో చిమ్మ చీకటి తప్పలేదు. దీంతో అమ్మకు కోపం వచ్చిందో ఏమో, కాన్వాయ్ రయ్యి మంటూ ముందుకు దూసుకెళ్లినట్టు అక్కడి వాళ్లు పేర్కొంటున్నారు. నిత్యం ఇక్కడ ఆరున్నర - ఏడున్నర గంటల మధ్యలో పవర్ కట్ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో దారి దోపిడీలూ కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అమ్మ రాకతో ఈ రోడ్డుకు కొత్త మెరుగులు దిద్దిన అధికారులు పవర్ కట్ సమస్యను మరిచినట్టున్నారు. అయితే, ఈ పవర్ కట్ సమస్య అధికారుల్ని వణికిస్తున్నాదట. ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న అధికారులందరిపై అమ్మ కన్నెర్ర చేస్తారో అన్న భయంలో వారు జారుకున్నారట. -
సారు.. వస్తారా?
చెన్నై: ఇది ఎన్నికల బరిలో ఉన్న జేడీయూ అభ్యర్థులు నెలకొన్న బెంగ. తమకు మద్దతుగా ప్రచారానికి బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటూ ఎదురు చూపుల్లో అభ్యర్థులు ఉన్నారు. కేరళకు రాబోతున్న ఈ సారు..ఇక్కడికి వస్తారా? అన్న ప్రశ్న తప్పడం లేదు. రాష్ట్రంలో జేడీయూ నేతృత్వంలోని కొన్ని చిన్నాచితకా పార్టీలు, సంఘాలు, కుల పార్టీలు ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. తమకూ బలం ఉందని చాటుకునే విధంగా దక్షిణ తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో పలు నియోజకవర్గాల్ని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. తమ చిహ్నం ‘ధనస్సు' ను ప్రజల్లోకి తీసుకెళ్లి, మద్దతు సేకరణలో తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారట. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆయా పార్టీలకు మద్దతుగా జాతీయ నేతలు తమిళనాడు వైపుగా తరలి వస్తుండడంతో తమ సారూ..వస్తారా..? అన్న ఎదురు చూపుల్లో అభ్యర్థులు ఉన్నారట. దేశ వ్యాప్తంగా తమ పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నాల్లో ఉన్న బీహార్ సీఎం, జెడీయూ అధినేత నితీష్‌కుమార్ కేరళ ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టుగా సంకేతాలు రావడంతో ఇక్కడి అ భ్యర్థుల్లో ఎదురు చూపులు పెరి గాయి. కేరళకు వస్తున్న నితీష్ ఇక్కడ, ముఖ్య నియోజకవర్గా ల్లో పర్యటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు తగ్గ వినతి ప త్రం ఇప్పటికే బీహార్ చేరినట్టు, ఆయన రావడం ఖాయం అన్న ధీమాను ఇక్కడి నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొని మరో మారు సీఎంగా అవతరించిన నితీష్‌కు డీఎంకేతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ సమయంలో ఇక్కడికి ఆయన వచ్చిన పక్షంలో డీఎంకే, కాంగ్రెస్ కూటమిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే దిశగా పరుగులు తీస్తున్న నితీష్, ఇక్కడి చిన్నా చితక అభ్యర్థుల కోసం వచ్చి రాజకీయ మేధావి కరుణతో వైర్యం పెంచుకోరని భావించ వచ్చు. -
సుడిగాలి పర్యటన
నేడు అమిత్‌షా రాక ఒకే రోజు ..నాలుగు సభలు రేపు సోనియా రాక ఏడున రాహుల్ స్టార్ హోదా తమిళనాట ఓట్ల వేట లక్ష్యంగా సుడిగాలి పర్యటనకు జాతీయ పార్టీల పెద్దలు సిద్ధమయ్యారు. బుధవారం రాష్ట్రంలో నాలుగు చోట్ల బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యక్షం కానున్నారు. గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ చెన్నై బహిరంగ సభకు పరిమితం కానున్నారు. ఏడో తేదీన మదురై, కోయంబత్తూరులలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. చెన్నై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడియలు సమీపిస్తున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెలువడడంతో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు, కూటమి పార్టీల్లోని మిత్రులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇన్నాళ్లు చడి చప్పుడు లేకుండా ఉన్న వాతావరణం, ప్రస్తుతం మిన్నంటుతున్నది. అభ్యర్థుల ప్రచార సమరం హోరెత్తుతుండడంతో సుడిగాలి పర్యటనలకు జాతీయ స్థాయి పెద్దలు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, డీఎంకే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంలతో పాటుగా, సీపీఎం, సీపీఐ జాతీయ పెద్దలు తమిళనాడు వైపు పరుగులు తీయడానికి సిద్ధమయ్యారు. వీరి ప్రచారాలు ఆగమేఘాలపై సుడిగాలి రూపంలో సాగబోతున్నాయి. నేడు అమిత్ షా : అధికారం మాట పక్కన పెట్టి, ప్రతినిధి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో కమలనాథులు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆరు లేదా, ఎనిమిదో తేదీల్లో ఆయన పర్యటన సాగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్ర మంత్రులు పలువురు రాష్ట్రంలో ప్రచారంలో ఉన్నారు. ఇక, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓమారు తిరుచ్చి సభలో ప్రత్యక్షం అయ్యారు. తదుపరి బుధవారం సుడిగాలి పర్యటనకు అమిత్ షా సిద్ధం అయ్యారు. ఒకే రోజు ఆయన నాలుగు బహిరంగ సభల్లో ప్రత్యక్షం కాబోతున్నారు. ఉదయం పదిన్నర గంటలకు పుదుకోట్టైలోనూ, రెండున్నర గంటలకు తిరునల్వేలి జిల్లా తెన్‌కాశిలో, నాలుగున్నర, ఐదు గంటల మధ్యలో కన్యాకుమారి జిల్లా నాగుర్ కోవిల్లో, రాత్రి ఏడున్నర గంటల మధ్యలో మదురైలో జరిగే బహిరంగ సభల్లో అమిత్ షా ఓటర్లను ఆకర్షించే ప్రసంగం చేయనున్నారు. అమిత్ షా ఒక్క రోజు పర్యటనలో జరగనున్న నాలుగు బహిరంగ సభల్ని విజయవంతం చేయడానికి కమలనాథులు సర్వం సిద్ధం చేసి ఉన్నారు. రేపు సోనియా రాక: డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఓట్ల వేటకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సిద్ధమయ్యారు. గురువారం చెన్నైలో ఆమె పర్యటన సాగనున్నది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, సోనియాగాంధీ ఐలాండ్ గ్రౌండ్ వేదికగా ఓటర్లకు పిలుపు నివ్వబోతున్నారు. ఇందు కోసం ఐలాండ్ గ్రౌండ్లో వేదిక సిద్ధం అవుతున్నది. భారీ జనసమీకరణ దిశగా కాంగ్రెస్ వర్గాలు పరుగులు తీస్తున్నాయి. సోనియా రాకతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎస్జీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై పరిశీలన జరిపారు. కొన్ని మార్పులు చేర్పులకు తగ్గ సూచనల్ని స్థానిక అధికారులకు చేశారు. సోనియా తదుపరి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ర్టంలో పర్యటించనున్నారు. ఏడో తేదీన మదురై, కోయంబత్తూరులలో ఆయన పర్యటన సాగనుంది. ఉదయం మదురైలో జరిగే బహిరంగ సభతో కూటమి అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. సాయంత్రం కోయంబత్తూరు కొడీస్సీయ మైదానంలో జరిగే బహిరంగ సభకు రాహుల్ హాజరవుతారు. ఈ వేదికపై రాహుల్ గాంధీతో పాటుగా డీఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి ప్రత్యక్షం కాబోతున్నారు. ఈ పర్యటన తదుపరి పదమూడు తేదీన దక్షిణ తమిళనాడులో తమ అభ్యర్థులు బరిలో ఉన్న ప్రాంతాల్ని గురి పెట్టి రాహుల్ రోడ్ షోకు సిద్ధం అవుతున్నారు. ప్రచార సమరం వేడెక్కడంతో కాంగ్రెస్ గ్రూపు నేతలు సైతం రంగంలోకి దిగనున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, నటి,అధికార ప్రతినిధి కుష్బు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తోండగా, ఇక కేంద్రమాజీ మంత్రి చిదంబరం, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్, తమాకా నుంచి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన పీటర్ అల్ఫోన్స్, విశ్వనాథన్ వంటి వాళ్లను స్టార్ వ్యాఖ్యాతలుగా ప్రకటించి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇవ్వడం విశేషం. -
అమ్మను సాగనంపండి!
డీఎంకేను ఆదరించండి ఓటర్లకు కరుణ పిలుపు ప్రచారానికి శ్రీకారం సైదాపేటలో భారీ బహిరంగ సభ ఐక్యతతో పనిచేయండని కార్యకర్తలకు పిలుపు అధికారమే మార్పు లక్ష్యంగా డీఎంకేను ఆదరించాలని ఓటర్లకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి విన్నవించారు. వరద ప్రళయంలో ప్రజలు తల్లడిల్లుతుంటే అడుగు బయట పెట్టకుండా, సుఖవంత జీవనం సాగించిన ఆ మహారాణిని సాగనంపుదామని పిలుపునిచ్చారు. సైదాపేట వేదికగా ఎన్నికల ప్రచారానికి శనివారం కరుణానిధి శ్రీకారం చుట్టారు. చెన్నై : అధికారం పగ్గాలు చేపట్టాలన్న కోటి ఆశలతో డీఎంకే వర్గాలు ప్రచారంలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. తొమ్మిది పదులు దాటిన వయస్సులో వయోభారంతో కరుణానిధి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాలకు దూరంగానే ఉన్నారు. కేవలం కొన్ని చోట్ల బహిరంగ సభల్లో మాత్రం పాల్గొన్నారు. అయితే, ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఓ వైపు డీఎంకే దళపతి స్టాలిన్, మరో వైపు కుమార్తె కనిమొళి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతుండగా, ఇక తాను సైతం అంటూ కరుణానిధి కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటన సాగేందుకు వీలుగా ప్రత్యేక ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేయించారు. శనివారం సైదాపేట వేదికగా ప్రచారానికి కరుణానిధి శ్రీకారం చుట్టారు. కరుణానిధి వెంట మనవడు. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ ప్రచారరథంలో గోపాలపురం నుంచి కదిలారు. అన్నా అరివాలయం వద్ద కరుణానిధికి మహిళా విభాగం వర్గాలు కర్పూర హారతులు పట్టాయి. సైదాపేటలో ఏర్పాటు చేసిన వేదికపై అక్కడి అభ్యర్థి సుబ్రమణియన్, వేళచ్చేరి- వాగై చంద్రశేఖర్, టీనగర్ - కనిమొళి తదితర అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసి ప్రసంగించారు. ఆదరించండి: స్వలాభం కోసం తాను పాకులాడడం లేదని చెప్పారు. ఐదేళ్లుగా ఈ అన్నాడీఎంకే సర్కారు ప్రజలకు చేసింది శూన్యమేనని ఆరోపించారు. గతంలో తాము చేసిన పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు మాత్రమే చేశారని వివరించారు. అహంకార పూరితంగా, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి నియంతలా వ్యవహరిస్తున్న ఆ మహారాణిని సాగనంపేందుకు ప్రజలు కంకణబద్దులు కావాలని ప్రజలను కోరారు. వర్షాలు సృష్టించిన వరద ప్రళయంతో ప్రజలు తల్లడిల్లుతుంటే, వారిని ఓదార్చేందుకు కూడా అడుగు బయట పెడ్డకుండా సుఖవంత జీవితాన్ని సాగించిన ఆ మహారాణి పతనం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఓట్లు వేయించుకుని మాట మార్చే తత్వం తనది కాదు అని, తప్పకుండా అన్నింటినీ అమలు చేసి తీరుతానని నమ్మకంతో ఆదరించాలని విన్నవించారు. సుఖవంత జీవితాన్ని అలవాటు పడ్డారు కాబట్టే, ఇప్పుడు కూడా హెలికాప్టర్లో తిరుగుతూ ఓటర్ల వద్దకు వస్తున్నారనని అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఉద్దేశించి మండి పడ్డారు. సెంబరంబాక్కం డ్యాం నీటి విడుదలకు గల కారణాలు, ఇందుకు బాధ్యుల గురించి కనీసం విచారణ కూడా చేపట్టకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా ఇంట్లో హాయిగా నిద్ర పోయిన ఈ సీఎం తీరును ఓ మారు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ మహారాణి పతనాన్ని కాంక్షిస్తూ అధికార మార్పు దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా కుమారుడు, దళపతి స్టాలిన్ రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తున్నారని గుర్తు చేశారు. ఇక, ‘ తానూ మీ ముందుకు వస్తున్నానని తనను అంటే వ్యక్తిగతంగా తనన్కొడినే కాదు డీఎంకే , కాంగ్రెస్ కూటమి’ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. పార్టీ వర్గాలు, కార్యకర్తలు అన్నదమ్ముల వలే ఐక్యతతో పనిచేయాలని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అధికార పగ్గాలు లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని వాళ్లకేదో దారాదత్తం చేసినట్టుగా, పట్టా ఇచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ నోళ్లకు కళ్లెంపడే విధంగా తనకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. నమ్మకంతో ఓట్లు వేసి ఆదరించాలని, అదే నమ్మకంతో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసి తీరుతానని కరుణానిధి హామీ ఇచ్చారు.