అమ్మకే పవర్ కట్
చెన్నై: రాష్ట్రంలో సంపూర్ణ విద్యు త్ లక్ష్యం..! కాదు..కాదు.. మిగులు విద్యుత్.!. విద్యుత్ కోతల రహిత రాష్ట్రం మనదే..! అన్న నినాదంతో ముందుకు సాగుతున్న ‘అమ్మ’జయలలితకే పవర్ కట్ అంటే ఎలా ఉంటుందో విద్యుత్ శాఖ వర్గాలు రుచి చూపించాయట..!. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ కట్ ఎందరి ఉద్యోగాలకు ఎసరు పెట్టనుందో. రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేవు అని, సంపూర్ణ విద్యుత్ అందుతున్నదని, త్వరలో మిగులు విద్యుత్‌ను చూడబోతున్నారంటూ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదే పదే ఎన్నికల ప్రచారంలో తన ప్రచారాస్త్రంగా నినదిస్తున్నారు.
పాలకులు ఓ రకం వ్యాఖ్యలు చేస్తుంటే, మరో వైపు విద్యుత్ శాఖ వర్గాలు తమ పనితనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో అనధికారికంగా అక్కడక్కడ కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇవన్నీ అమ్మకు మాత్రం తెలియదని సమాచారం. అందుకే కోతలంటే ఎలా ఉంటాయో అమ్మకు తెలిపినట్టున్నారు.
ఆర్కేనగర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్న అమ్మ జయలలిత శుక్రవారం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలతో దూసుకెళ్లారు. అలా...అమ్మ పయనంలో సున్నాం కాలువ నుంచి మనలి రోడ్డు వైపుగా వీధి దీపాలన్నీ వెలగకపోవడంతో చిమ్మ చీకటి తప్పలేదు. దీంతో అమ్మకు కోపం వచ్చిందో ఏమో, కాన్వాయ్ రయ్యి మంటూ ముందుకు దూసుకెళ్లినట్టు అక్కడి వాళ్లు పేర్కొంటున్నారు.
నిత్యం ఇక్కడ ఆరున్నర - ఏడున్నర గంటల మధ్యలో పవర్ కట్ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో దారి దోపిడీలూ కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అమ్మ రాకతో ఈ రోడ్డుకు కొత్త మెరుగులు దిద్దిన అధికారులు పవర్ కట్ సమస్యను మరిచినట్టున్నారు. అయితే, ఈ పవర్ కట్ సమస్య అధికారుల్ని వణికిస్తున్నాదట. ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న అధికారులందరిపై అమ్మ కన్నెర్ర చేస్తారో అన్న భయంలో వారు జారుకున్నారట.