త్రిముఖ పోటీ! | andhra maha sabha elections at tomorrow | Sakshi
Sakshi News home page

త్రిముఖ పోటీ!

Published Fri, Feb 28 2014 10:54 PM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

andhra maha sabha elections at tomorrow

దాదర్, న్యూస్‌లైన్ : దాదర్‌లోని ‘ది ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా’లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థలో 2,600 మంది సభ్యులున్నారు. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలకు మాతృసంస్థగా విరజిల్లుతున్న ఈ సంస్థ ఎన్నికలపై అనేక మంది తెలుగు ప్రజలు దృష్టి సారించారు.

ముఖ్యంగా కొంతమంది ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దీంతో ఆదివారం జరగనున్న ఎన్నిక ల్లో ఎవరు గెలుపొందనున్నరనే విషయంపై అనేక మందిలో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఆంధ్ర మహాసభ ఎన్నికల్లో జనచైతన్య ప్యానల్, ప్రగతి ప్యానల్, విజన్ గ్రూప్ ప్యానల్  బరిలో ఉన్నాయి. దీంతో త్రిముఖ పోటీ జరుగనుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్నేళ్లుగా ఆంధ్ర మహాసభలో జరుగుతున్న పరిణామాలు ఏమంత ఆశాజనకంగా ఉండటంలేదు. గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన రెండు కార్యవర్గాలనూ బలవంతంగా రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిలో ఒక కార్యవర్గం కేవలం ఎనిమిది నెలలే అధికారంలో ఉండగా, మరో కార్యవర్గం ఏకంగా సుమారు 18 నెలలపాటు అధికారంలో కొనసాగింది.

 మరోవైపు గత కొన్నేళ్లుగా మహాసభ నిర్వహణలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈ సారి జరగబోయే ఎన్నికలపై అనేక మంది దృష్టి సారించారు. గతంలో జరిగిన కొన్ని ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల స్థాయిలో హడావుడిగా కన్పించగా, ఈ సారి మాత్రం కొంతమేర ఆ హడావుడి తగ్గినట్టుగా కన్పిస్తోంది. అయితే ఎవరు ఎన్నికైనా సభ గౌరవాన్ని కాపాడటంతోపాటు పారదర్శకమైన పరిపాలన అందించాలని సాధారణ సభ్యులు కోరుకుంటున్నారు.  

 82 ఏళ్ల కిందటే...
 ఉపాధి కోసం ముంబై నగరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న లక్షలాది తెలుగు ప్రజల సాంసృ్కతిక వారసత్వాన్ని, సంసృ్కతిని, సంప్రదాయాలను, తెలుగు భాషను పరిరక్షించడానికి ఈ సంస్థను కొంతమంది 82 ఏళ్ల కిందట ‘ది బొంబాయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. 1932లో ఏర్పడిన ఈ సంస్థ మహారాష్ట్రలో తెలుగు వారి మాతృసంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. బొంబాయి ప్రొవిన్సియల్ ఆంధ్ర మహాసభ, ఆంధ్ర హోం, ఆంధ్ర నిలయం లైబ్రరీ అనే మూడు సంస్థలను విలీనం చేసి ఆంధ్రమహాసభను ఏర్పాటు చేశారు. ఆంధ్రమహాసభ ఆవిర్భవించిన మొదట్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ సంస్థ విస్తృత కార్యకలాపాల కోసం  స్థలం సరిపోలేదు.

 దీనికి పెద్ద స్థలం అవసరమైంది. తూర్పు దాదర్‌లో ఉన్న ఖాళీ ఆట స్థలం తమ సంస్థకు కేటాయించాలని అప్పట్లో మహాసభ పెద్దలు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అది ఆట స్థలం కావడంవల్ల స్థలం మంజూరు కోసం జాప్యం జరిగింది. దీంతో ది బొంబాయి ఆంధ్ర మహాసభ అనే పేరు పక్కన ‘అండ్ జింఖానా’ అనే పదాన్ని చేర్చి మళ్లీ దరఖాస్తు చేశారు. ఆంధ్ర మహా సభ సాంస్కృతిక క్రీడా, వినోదాల నిమిత్తం ఏర్పాటుచేసిన సంస్థ అని అప్పట్లో ప్రభుత్వానికి విన్నవించారు. వెంటనే ప్రభుత్వం మహాసభకు స్థలాన్ని మంజూరు చేసింది.

అలా ఈ స్థలం సంపాదించడానికి, అక్కడ మొదటి దశ నిర్మాణం సాగించడానికి తీవ్రంగా పాటుపడిన వారిలో సోమంచి యజ్ఞన్న శాస్త్రి, శిష్టా వెంకట్రావ్, దేశీరాజు నరసింహారావు, ఇ.వి.ఎస్. దేశికాచారి ఉన్నారు. 1950-60 దశాబ్దంలో ఆంధ్ర మహాసభ నిలదొక్కుకుని పురోగమించింది. ఈ కాలంలోనే ప్రథమ కట్టడం పూర్తయింది. వేదిక దాంతోపాటు ఉత్తరాన గదులు, మరుగు దొడ్లు నిర్మితమయ్యాయి. వేదిక నిర్మాణమైన తర్వాత అక్కడ నాటక, నృత్య ప్రదర్శన కార్యక్రమాలు విరివిగా జరిగాయి. ముంబైలోని అన్ని తెలుగు సంస్థలతో ఆంధ్ర మహాసభ స్నేహ సంబంధాలు ఏర్పర్చుకుంది.

 1974లో జరిగిన ప్రథమ తెలుగు ప్రపంచ మహాసభల్లో మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. ముంబై మహానగరానికి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారికి తక్కువ వ్యయంతో మహసభలోని గదుల్లో ఉండేందుకు వసతి కల్పిస్తున్నారు.  అంతేకాకుండా మెరిటోరియల్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మహాసభ ఆవరణలో యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు 1937లోనే మహిళా శాఖ ఏర్పాటైంది. వీరు కూడా ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ 1957లో రజతోత్సవం, 1982లో స్వర్ణోత్సవం, 1992లో వజ్రోత్సవం, 2007లో అమృత మహోత్సవాలను నిర్వహించింది.  అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ప్రవాస సంస్థగా ఎంపిక చేసి ఉగాది పురస్కారాన్ని అందజేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement