రవికిరణ్ అరెస్టు దారుణం: ఏపీసీసీ
సోషల్ మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ, అరాచక ప్రయత్నాలను ఏపీసీసీ తీవ్రంగా ఖండించింది.
విజయవాడ: సోషల్ మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ, అరాచక ప్రయత్నాలను ఏపీసీసీ తీవ్రంగా ఖండించింది. పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్‌ను అక్రమ అరెస్టు చేసి వేధింపులకు గురిచేయడం పట్ల ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ ఖండించారు. శాసనమండలి భవనంపై అసభ్యకర ఫొటో పెట్టినట్టుగా ఫిర్యాదును సృష్టించి.. అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలు చంద్రబాబు నాయుడి అక్రమ పాలనా తీరుకు నిదర్శనమన్నారు.
ఎవరైనా సోషల్ మీడియా ద్వారా భంగం కలిగించి ఉంటే.. దానికి చట్టపరంగా అనేక పద్దతులున్నాయన్నారు. కానీ అధికారం చేతిలో ఉందికదా అని తమ ఇష్టానుసారం అక్రమ పద్దతులను వినియోగించుకుంటే ప్రజలు సహించరని మండిపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడకుండా న్యాయస్థానాలు రవికిరణ్ అరెస్టు కేసును సుమోటో గా స్వీకరించి ప్రభుత్వాన్ని హెచ్చారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.