అన్నాడీఎంకేలో మరో చీలిక?
చెన్నై: జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. తాజాగా అధికార పార్టీ అన్నాడీఎంకేలో మరో కీలక పరిణామం సంభవించబోతోంది. మాజీ మంత్రి తోపు వెంకటాచలం సహా అధికార పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
వీరంతా కలిసి మరో చీలిక వర్గంగా ప్రకటించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శశికళ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీంఎం పన్నీరు సెల్వం వర్గాలు అన్నాడీఎంకే పార్టీలో పైచేయి కోసం పావులు కదుపుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మరో కుంపటి పెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కాగా అన్నాడీఎంకేలో ఉన్న చీలిక వర్గాలు రెండూ కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుమీద పోటీ చేయొచ్చని తలపెట్టిన అగ్రనేతలు.. విలీన చర్చలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను పళనిస్వామి వర్గం, ఆయన మంత్రులు తేలిగ్గా తీసుకోవడం, వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పన్నీర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఇక విలీన చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని పన్నీర్ సెల్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది.