న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించారని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చింది. అంతే కాకుండా ఐదేళ్ల కాలంలో 40 నుంచి 50 శాతం వరకు ఎన్నికల హామీలను నెరవేర్చగలమని అధికారులతో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. ఇది పూర్తిగా ఎలక్షన్ వాచ్‌డాగ్స్ మేనిఫెస్టో మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఈసీని కలసి బుధవారం ఫిర్యాదు చేశారు. ‘పౌర సేవల దినోత్సవం’ సందర్భంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఈసీకి తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇష్టం వచ్చినట్లు హామీల వర్షం కురిపించారని ఆరోపించారు.
తద్వారా ప్రజలను పక్కదారి పట్టించారని విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మేనిఫెస్టో మార్గదర్శకాల ప్రకారం అవాస్తవ ఎన్నికల వాగ్దానాలతో ప్రజలపై ప్రభావం చూపేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపారు. కాగా, పౌర సేవల దినోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై అనేక అంచనాలను పెట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుంటే ప్రస్తుతం మనల్ని ఎవరైతే పొగుడుతున్నారో వారే ఐదేళ్లలో విసిరివేసే అవకాశం ఉందన్నారు. కానీ ఐదేళ్లలో 100 శాతం హామీలను నెరవేర్చలేకున్నా కనీసం 40 నుంచి 50 శాతం మాత్రం నెరవేర్చగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి ఆధారంగా అజయ్ మాకెన్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
అబద్ధపు హామీలతో పక్కదారి పట్టించారు
Published Thu, Apr 23 2015 12:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement