అజయ్‌ మాకన్‌ (కాంగ్రెస్‌) రాయని డైరీ | Rajasthan Congress In-Charge Ajay Maken Offer To Resign | Sakshi
Sakshi News home page

అజయ్‌ మాకన్‌ (కాంగ్రెస్‌) రాయని డైరీ

Published Sun, Nov 20 2022 1:43 AM | Last Updated on Sun, Nov 20 2022 1:43 AM

Rajasthan Congress In-Charge Ajay Maken Offer To Resign - Sakshi

ఖర్గే పిలిపిస్తే వెళ్లాను. 
అక్బర్‌ రోడ్డులోని ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యాలయానికి ఆయన నన్ను పిలిపించలేదు. సఫ్దర్‌జంగ్‌ రోడ్డులోని తన నివాస గృహానికి పిలిపించారు! 
నేను వెళ్లేసరికి నా రాజీనామా లేఖ ఆయన కూర్చొని ఉన్న సోఫా ముందరి టీపాయ్‌ మీద చిన్నపాటి బరువుతో.. తండ్రి గుప్పెటలో బిగిసి ఉన్న తన చూపుడు వేలును విడిపించుకుని ముందుకు నడిచేందుకు ప్రయత్నిస్తున్న పిల్లవాడిలా ఉంది. 

‘‘ఏమిటిది అజయ్‌?’’ అన్నారు ఖర్గే... ఒక తండ్రిలాగే! 
ఎందుకు రాజీనామా చేశావు అని అడగలేదు ఆయన! ‘‘ఎలాంటి సమయంలో నువ్వు రాజీనామా చేశావో తెలుసా?’’ అన్నారు!
‘‘జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశిస్తున్న సమయంలో.. రాజస్థాన్‌లో ఒక ఉప ఎన్నిక కూడా జరగబోతున్న సమయంలో.. పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు ఇన్‌చార్జి అయిన ఒక ప్రధాన కార్యదర్శి రాజీనామా చేశారంటే కాంగ్రెస్‌ ప్రతిష్ఠ ఏమౌతుందో ఆలోచించావా అజయ్‌!’’ అన్నారు. 

‘‘పార్టీ ప్రతిష్ఠకు ఏమీ కాకుండా ఉండేందుకే రాజీనామా చేశాను ఖర్గేజీ..’’ అన్నాను. 
అప్పుడు కూడా ఆయన.. ‘‘రాజీనామా చేసి ఎక్కడికెళతావ్‌?’’ అన్నారే గానీ.. పార్టీ ప్రతిష్ఠకు వచ్చిన ముప్పు ఏమిటని గానీ, ఎందుకు రాజీనామా చేశావు అని గానీ అడగలేదు! 
‘‘రాజీనామా చేసి ఎక్కడికీ వెళ్లబోవడం లేదు ఖర్గేజీ! ఢిల్లీలోనే ఉంటాను. కార్మిక సంఘాలను సంఘటితం చేస్తాను. ఎన్జీవోలతో మమేకం అవుతాను. ఢిల్లీ వాయు కాలుష్యంపై గళమెత్తుతాను. వీధి వర్తకుల సంక్షేమం కోసం కృషి చేస్తాను. మురికివాడల పురోభివృద్ధికి పాటు పడతాను..’’ అన్నాను. 

ఒక్కసారిగా భళ్లున నవ్వారు ఖర్గే! 
కోపంతో ఇల్లొదిలి వెళ్తున్న కొడుకుని ఆపి, ‘బయటికెళ్లి ఎలా బతుకుతావ్‌రా..’ అని అతి సంపన్నుడైన తండ్రి ప్రశ్నిస్తే.. ‘ఎలాగైనా బతుకుతాను. మూటలు మోస్తాను, ముష్టెత్తుకుంటాను. ఆటో నడుపుతాను. హోటళ్లలో ప్లేట్లు కడుగుతాను. ఇంటికైతే రాను..’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి నవ్విన నవ్వులా ఉంది ఖర్గే నవ్వడం. 
నవ్వీ నవ్వీ.. హఠాత్తుగా గంభీరంగా మారి, ‘‘పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం అన్నది పార్టీ అప్పగించిన బాధ్యతలకు రాజీనామా చేసి వెళ్లిపోయినంత సులభం కాదు అజయ్‌..’’ అన్నారు ఖర్గే!
‘‘గెహ్లోత్‌ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడం కూడా సులభం కాదా ఖర్గేజీ?!’’ అన్నాను. 

అందుకు ఆయనేమీ మాట్లాడలేదు. 
‘‘రాజస్థాన్‌ సీఎంగా ఉండిపోవడానికి గెహ్లోత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతను కూడా తప్పించుకున్నారు. కానీ అతడిపై చర్యలేదు! సోనియాజీ మిమ్మల్నీ, నన్ను రాజస్థాన్‌కు పంపి పెట్టించిన సీఎల్పీ మీటింగ్‌కి తన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా రాకుండా వారితో గెహ్లోత్‌ తిరుగుబాటు చేయించారు. కానీ అతడిపై చర్యలేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలలో ముగ్గురితో కలసి నన్ను భారత్‌ జోడో యాత్రకు వెళ్లమంటున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నాను. నా ప్రతిష్ఠ కోసం కాదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠ కోసం..’’ అన్నాను. 
ఖర్గే నా వైపు ప్రయాసగా చూశారు. 

‘‘గెహ్లోత్‌ తన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించారు. నువ్వు నీ రాజీనామాతో తిరుగుబాటు చేస్తున్నావు. అంతే కదా? పార్టీ అధ్యక్షుడికి అతి కష్టమైన పనేంటో తెలుసా అజయ్‌? క్రమశిక్షణ చర్య తీసుకోవడం! పార్టీలోని నాయకులకు అతి సులువైన పనేంటో తెలుసా అజయ్‌? క్రమశిక్షణ చర్యకు అధ్యక్షుడిపై ఒత్తిడి తేకుండా ఉండటం! సులభమైన పనినే పార్టీ నాయకులు చేయలేక పోతున్నప్పుడు.. కష్టమైన పనిని పార్టీ అధ్యక్షుడు ఎలా చెయ్యగలడో చెప్పు’’ అన్నారు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement