
ఆర్య ప్రతీకారం
అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ రంగంలోనూ స్నేహంతోపాటు పగలు, ప్రతీకారాలు వంటివి కలగడం సహజం.
అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ రంగంలోనూ స్నేహంతోపాటు పగలు, ప్రతీకారాలు వంటివి కలగడం సహజం. అలా నటుడు ఆర్య హాస్య నటుడు సంతానం మధ్య మంచి మైత్రి ఉంది. వీరిద్దరూ కలసి పలు చిత్రాల్లో స్నేహితులుగా నటించారు. అలాంటిది ఇటీవల సంతానం నటిస్తున్న షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు ఆర్య. ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నారట. ఈ విషయాన్ని సంతానం చిత్ర యూనిట్ సాక్షిగా చెప్పడం విశేషం. మొన్నటి వరకు మంచి మిత్రులుగా వున్న వీరి మధ్య అంత శత్రుత్వం ఎలా కలిగిందంటే.... సంతానం ప్రస్తుతం ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఆష్కా జవేరి నటిస్తున్నారు. ఈ చిత్రం పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వాసువుం శరవణనుం ఒన్నా పడిచ్చవాంగా చిత్రంలో ఆర్య, సంతానం మరోసారి స్నేహితులుగా నటిస్తున్నారు.
ఈ సంగతి అటు ఉంచితే సంతానం చిత్రం షూటింగ్ సమయంలోనే ఆర్య నటిస్తున్న యట్చకన్ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో షూటింగ్ గ్యాప్‌లో ఆర్య, సంతానం షూటింగ్‌కు వచ్చి వెళ్లారు. పాటకు డాన్స్ మూవెంట్‌ను రిహార్సిల్ చేసే మూడ్‌లో వున్న సంతానం ఆర్య రాకను గమనించలేదు. సంతానం షాట్‌కు రెడీ అవడంతో ఆర్య నృత్య దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టి షాట్ కెమెరా, యాక్షన్ అన్నారు. దీంతో సంతానం, నటి ఆష్కా ఆడటం మొదలెట్టారు. అయితే వన్స్‌మోర్ ఇంకా బాగా ఆడాలంటూ ఆర్య పలుమార్లు సంతానంతో డాన్స్ చేయించడంతో అలసిపోయి ఇక నా వల్ల కాదు బాబు అంటూ ఆర్యను చూసి ‘‘నేను సినిమాలో పగ తీర్చుకుంటే మీరిప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారని అర్థం అయ్యింది మీకో నమస్కారం’’ అనడంతో యూనిట్ సభ్యులందరూ సరదాగా నవ్వుకున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.