
ఆసిన్‌పై ఆగ్రహం
భావ స్వేచ్ఛ ఉంది కదా అని సమయం, సందర్భం చూడకుండా మాట్లాడేస్తే నటి ఆసిన్‌లా తలనొప్పికి గురి కావలసిందే. చివరికి పోలీసులను ఆశ్రయించాల్సిందే. పైగా ఆసిన్ నోరు జారింది. సాధారణ అంశం పైనా దేశమంతా క్రికెట్ క్రీడాభిమానులు ఉద్రేకంతో ఉడికిపోయిన తరుణంలో ఆమె వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఆసిన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమే. అయితే ఆమె సగటు స్త్రీ కాదుగా. ప్రముఖ నటి. సెలబ్రెటి. ఇంతకీ ఆసిన్ చేసిన తప్పేమిటంటారా? చాలామందికి తెలిసినదే. ప్రపంచ కప్ క్రికెట్ క్రీడా పోటీలో ఆరు ఆటల్లో అజేయంగా నిలిచిన భారతజట్టు సెమీఫైనల్‌లో విరాట్ కొహ్లీ ఒకే ఒక్క రన్‌తో పీచేమూడ్ అనడం, భారతజట్టు ఓటమి పాలవడం క్రీడాభిమానులు జీర్ణించుకోలేని విషయం.
ఆ పోటీలకు కోహ్లీ ప్రియురాలు అనుష్కశర్మ వెళ్లడం ఆమెకు శాపంగా మారింది. క్రికెట్ వీరాభిమానులు అనుష్క శర్మ కారణంగానే ఆటపై కాన్‌సంట్రేట్ చేయలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనుష్కశర్మను ఆడిపోసుకుంటున్నారు. సహనటిగా ఈ విషయాలు నటి ఆసిన్‌ను చిర్రెత్తేలా చేశాయి. దీంతో పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించకుండా అనుష్క శర్మ చేసిన తప్పేంటి? అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొని చాలా పెద్ద తప్పే చేశారు. దీంతో కొహ్లీని, అనుష్క శర్మను వదిలేసిన అభిమానులు ఆసిన్‌పై దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. వారి ఆగ్రహం ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా ఆసిన్ పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఇష్టానికి మెసేజ్‌లు పోస్ట్ చేసేస్తున్నారు. క ఈ నకిలీ వెబ్‌సైట్ వ్యవహారం బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ లాంటి కొందరి చూపులకు చేరిపోయింది. వారు ఆసిన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆసిన్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. ఆసిన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వర్గం చెబుతోంది.