కవలల కనువిందు
చెన్నై: ఇద్దరు కవల పిల్లలు కన్పిస్తే చాలు చూడడానికి ముద్దేస్తుంటారు. అదే పదుల సంఖ్యలో అయితే ఇక కనువిందే. ఇందుకు వేదికగా బాలల దినోత్సవం నిలిచింది. నగరంలోని మొగపేర్ వేళమ్మాల్ విద్యా సంస్థ ఈ ఏడాది బాలల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించింది. తమ విద్యా సంస్థలో ఎల్‌కేజీ నుంచి ప్లస్ టూ వరకు చదువుకుంటున్న కవల పిల్లల్ని ఎంపిక చేసి, వీరి ద్వారా వినూత్నంగా వేడుకలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కవల పిల్లలు ఒకే వేదిక మీదకు రావడంతో కనువిందుగా మారింది. అన్నాతమ్ముడు, అక్కాచెల్లెలు, అక్కాతమ్ముడు, అన్నాచెల్లలుగా కవలలు ఒకరి వెంట మరొకరు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒకే వేదిక మీదకు 76 మంది కవలలు
తమ విద్యా సంస్థలో చదువుకుంటున్న 76 మంది కవల జంట పిల్లలను బాలల దినోత్సవానికి ఎంపిక చేశారు. ఒక్కో జంటకు ఒక్కో డ్రెస్ కోడ్, వేషాధారణ, అలంకరణ అప్పగించారు. ఒక్కో కవల జంట ఒకే వస్త్రధారణ, వేషధారణ, పాద రక్షల మొదలు చేతి గాడియారం వరకు ఒకే విధంగా ధరించి ప్రత్యక్షం కావడంతో మరింత ఆకర్షణగా మారింది. ఒక్కో జంట అక్కడి వేదిక మీద నిర్వహించిన పోటీల్లో తమ ప్రతిభను చాటుకుని బహుమతుల్ని సొంతం చేసుకునే యత్నం చేశారు. బాంబే సిస్టర్స్ పేరిట గాయకులుగా పెరెన్నికగన్న సరోజ, లలితలు ఈ వేడుకలలో తమలాగే ఉన్న సహచర కవల పిల్లల్ని చూసి ఎందో సంబరపడిపోయారు. వారితో ఫొటోలు దిగారు. తమ కెమెరాల్లో ఆ పిల్లల ఫొటోలను బంధించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కవల పిల్లల్లో ఎవరి పేర్లు ఎవరివోనని గుర్తించలేని రీతిలో అచ్చుగుద్దినట్టు ఉండడం విశేషం.