సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఆటో, టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊరట లభించే నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు తీసుకుంది. ఓవర్ చార్జింగ్, ప్రయాణీకులు అడిగిన చోటికి రానని నిరాకరించడం, పీఎస్‌బీ బ్యాడ్జిలు, యూనిఫారం ధరించకుండా వాహనం నడపడం వంటి చిన్న నేరాలకు ఆటో, టాక్సీ డ్రైవర్లపై కేసు నమోదు చేసే అధికారాన్ని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ కమిషనర్ గీతాంజలి గుప్తా అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర రవాణా అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది.
ఆ తరువాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మోటారు వాహనచట్టం నిబంధనల ప్రకారం 66/192ఏ కింద యూనిఫారం ధరించకపోవడం, అడిగిన చోటికి రానని నిరాకరించడం, స్టాండ్ వద్ద ప్రయాణికున్ని ఎక్కించుకోకపోవడం, పోలీస్‌ల హెల్ప్‌లైన్ నంబర్లను ప్రదర్శించకపోవడం వంటి చిన్న నేరాలకు జరిమానా విధించడం, వాహనాలను స్వాధీనం చేసుకునే ప్రత్యేక అధికారాలు ట్రాఫిక్ పోలీసులకు ఉన్నాయి. ఇటువంటి మామూలు ఉల్లంఘనలకు ఆటోవాలాలను శిక్షించే అధికారాన్ని ట్రాఫిక్ పోలీసుల వద్ద నుంచి తొలగించనున్నారు. కాగా, లెసైన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ లేకుండా వాహనాలను నడపడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడేవారిపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడతారు.
ఆటోవాలాలకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊరట!
Published Thu, Apr 9 2015 10:43 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement