ఆప్‌పై అలిగిన ఆటో!!
ఈసారి ప్రచారం చేయడానికి విముఖత
ఇదే అభిప్రాయంలో చాలా మంది డ్రైవర్లు
కేజ్రీవాల్ చేసిన వాగ్దానాలను నెరవేర్చనందుకే..
మధ్యలోనే వైదొలగడంపై అసంతృప్తి
యూనియన్ల నాయకులతో ఆప్ మంతనాలు?
అయినా ససేమిరా అంటున్న సంఘాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీపై నగర ంలోని ఆటోవాలాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పురుడుపోసుకున్నప్పుడు అందరికంటే మొదటగా ఆప్ తరఫున ప్రచారం చేసింది ఆటోవాలాలే. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అధికారంలోకి వస్తే సామాన్యుల కష్టాలు తీరిపోతాయని భావించిన ఆటోవాలాలు ఉచితంగానే తమ ఆటోల వెనుక ఆమ్ ఆద్మీ తరఫున ప్రచారం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం వెనుక ఆటోవాలాల ప్రచారం ప్రభావం ఎంతోఉందని కేజ్రీవాల్ కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఆటోవాలాలు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ కూడా ఇచ్చారు. తదనంతర పరిణామాల తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం కుప్పకూలడం, ఆటోవాలాల హామీలు.. హామీలుగానే మిగిలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఆటోడ్రైవర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం మిగతా హామీలను నెరవేర్చకుండానే కేజ్రీవాల్ తప్పించుకున్నారని మండిపడుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకోసం ఎంతో శ్రమించామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరిస్తుందని భావించామని, అయితే తాము కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయని చెబుతున్నారు. ఇలా మధ్యంతరంగా కేజ్రీవాల్ వైదొలగకుండా ఉంటే ప్రజలకు మరింత మంచి జరిగేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఆప్ నేతలు కొందరు తమను సంప్రదిస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి మావద్దకు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈసారి ప్రచారం చేసేదిలేదని వారితో చెప్పినట్లు కొందరు ఆటోవాలాలు చెప్పారు. దాదాపు మెజార్టీ డ్రైవర్ల అభిప్రాయం ఇదేనన్నారు. కొంతమంది కేజ్రీవాల్ కోసమైనా ప్రచారం చేద్దామనే అభిప్రాయంలో ఉన్నారని, అయితే అధికారంలో ఉన్నన్ని రోజుల్లో ఆటోవాలా కోసం కేజ్రీవాల్ చేసిందేమీ లేదని, అందుకోసమే తాము ప్రచారం చేయలేమని చెప్పామంటున్నారు. ఈ విషయమై ఢిల్లీ ఆటోరిక్షా యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సోనీ మాట్లాడుతూ... ‘49 రోజులు అధికారంలో ఉన్నా మాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చిన్న చిన్న తప్పులకు ఆటోవాలాలను ఇబ్బంది పెట్టరంటూ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఆటోలను అధికారులు సీజ్ చేయరని చెప్పారు. అయినప్పటికీ రవాణా విభాగం అధికారులు, పోలీసుల వేధింపులు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన ప్రకటనను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు అందలేదని చెబుతూ డ్రెస్ లేకున్నా, లెసైన్స్ రిన్యూవల్ చేయించుకోకపోయినా, పర్మిట్, ఫిట్‌నెస్ విషయంలో చిన్న చిన్న లోపాలున్నా ఆటోను సీజ్ చేస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలను జారీ చేసిఉంటే ఇప్పుడు మాకు ఈ సమస్య ఉండేదికాదు. కానీ కేజ్రీవాల్ ఆ పని చేయలేకపోయారు. మేం చాలా అసంతృప్తిగా ఉన్నామ’న్నారు.
సంఘాల నాయకులను కలుస్తున్న ఆప్ నేతలు
ఆటో డ్రైవర్లు తమపై అసంతృప్తిగా ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వారితో మాట్లాడేందుకు తమ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆప్ నేత ఒకరు తెలిపారు. ఆటో యూనియన్ల నాయకులతో పారీ ్ట సీనియర్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు కూడా యూనియన్ల సభ్యులు చెబుతున్నారు. మరోసారి తమ పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిందిగా ఆప్ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా తమను సంప్రదిస్తున్నారని చెబుతున్నారు. అయితే తాము మాత్రం ఏ పార్టీ తరఫున ప్రచారం చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు.