
బంద్ సంపూర్ణం
► స్తంభించిన తమిళనాడు
► మూతపడ్డ వ్యాపార సంస్థలు
► స్టాలిన్ సహా వేలాది మంది అరెస్ట్
అన్నదాతల సమస్యల పరిష్కారానికి చేపట్టిన బంద్ జనజీవనాన్ని స్తంభింపజేసింది. కరువు సహాయక చర్యలు, ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాలకు నష్టపరిహారం తదితర డిమాండ్ల సాధనకు మంగళవారం విపక్షాల బంద్ సక్సెస్ అయింది. బంద్‌లో పాల్గొన్న డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు అగ్రనేతలు సహా వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం కర్నాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడం లేదు. రుతుపవనాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర చరిత్రలో కనీవినీఎరుగని కరువు తాండవిస్తోంది. ఎండిపోయిన పంటలతో దిక్కుతోచని అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలను ఆదుకోలేదనే ఆవేదనతో రైతు నేత అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీలో 41 రోజులపాటూ ఆందో ళనలు నిర్వహించారు. ఢిల్లీ పోరాటాన్ని ఈనెల 23వ తేదీన తాత్కాలికంగా నిలిపివేసి రైతన్నలంతా రాష్ట్రం చేరుకున్నారు. తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఈనెల 16వ తేదీన సమావేశమై 25వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని తీర్మానించారు. బంద్‌లో పాల్గొనాల్సిందిగా ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
స్టాలిన్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం బంద్ జరిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియన్ ముస్లీంలీగ్, ద్రావిడర్ కళగం, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి తదితర పార్టీల నేతలు ఉదయాన్నే తమ పార్టీ పతాకాలను చేతబట్టి ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దుకాణలన్నీ మూతపడ్డాయి. ప్రయివేటు వాహనాలు తిరిగినా ప్రభుత్వ బస్సులు బస్‌స్టేషన్‌కు పరిమితమైనాయి. పోలీసు బందోబస్తుతో స్వల్ప సంఖ్యలో బస్సులు తిరిగాయి. కోయంబేడు సీఎంబీటీ బస్‌స్టేషన్ నుండి పొరుగురాష్ట్రాలకు వెళ్లే బస్సులు పరిమిత సంఖ్యలో బయలుదేరాయి. కోయంబేడు కూరగాయల మార్కెట్‌లో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. అనేక చోట్ల ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లోకి జొరబడి మూసివేయించారు.
ఒకవైపు ఎండ, మరోవైపు బంద్ కారణంగా జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అలాగే ఎగ్మూరులో టీఎన్‌సీసీ అధ్యక్షులు తిరునావుక్కరసర్, రైతు నాయకుడు అయ్యాకన్ను, సైదాపేట జాంబజార్ రోడ్డులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ తదితర రెండు వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువారూరులో తమిళనాడు కావేరీ వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి పీఆర్ పాండియన్ తదితరులు రాసారోకో నిర్వహించి అరెస్టయ్యారు.
కాంచీపురం, తిరువళ్లూరులో బస్సులపై రాళ్లు రువ్వి, అద్దాలను పగులగొట్టి పాక్షికంగా ధ్వంసం చేశారు. చెన్నైతోపాటూ సేలం, తిరుచ్చి, మధురై, నెల్‌లై, కోవై, వేలూరు తదితర జిల్లాల్లో సైతం దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా రాస్తారోకులు జరిగాయి. డీఎంకే అగ్రనేత స్టాలిన్ తదితర నేతలు తిరువారూరులో మూడు కిలోమీటర్లు నడిచి రాస్తారోకోకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నదాతల అక్రందనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుంటే మరోసారి ఉద్యమిస్తామని స్టాలిన్ హెచ్చరించారు. కాగా, పుదుచ్చేరీలో సైతం బంద్ సక్సెస్ అయింది. వ్యాపార, వాణిజ్య సంస్థలను, పారిశ్రామిక వాడలను మూసివేసి మద్దతు తెలిపారు. వాహనాలు సైతం తిరగలేదు.
ప్రధాని మోదీపై పోలీసుకు ఫిర్యాదు: తమిళనాడులోని రైతన్నలను ఆత్మహత్యకు పురిగొల్పారని పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోదీపై తమిళనాడు కావేరీ వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి పీఆర్ పాండియన్ మన్నార్‌కుడి కోరడాచ్చేరీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కావేరీ సమస్యను కేంద్రం నిర్లక్ష్యం చేయడం వల్లనే రాష్ట్రంలో 400 మందికి పైగా అన్నదాతలు ప్రాణాలు విడిచారని ఆయన తెలిపారు. కావేరీ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయక పోవడం కోర్టు దిక్కారం కిందకు వస్తుందని ఆయన అన్నారు. ప్రధానిపై కోర్టు దిక్కారం కేసును, పరోక్షంగా రైతులను ఆత్మహత్యకు పురిగొల్పిన నేరంపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.