బెంగళూరు రౌడీషీటర్ హొసూరులో దారుణ హత్య
- జాతీయరహదారిపై తరిమి తరిమి హత్య చేసిన ప్రత్యర్థులు
- హతుడిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో 32 కేసులు
సిప్‌కాట్: బెంగళూరుకు చెందిన ఓ రౌడీ షీటర్‌ను మంగళవారం అర్థరాత్రి హొసూరు సిప్‌కాట్ సమీపంలో ప్రత్యర్థులు దారుణంగా నరికి హత్య చేశారు.బెంగళూరు నుంచి కారులో హొసూరుకు వస్తుండగా, హొసూరు సిప్‌కాట్ వద్ద ప్రత్యర్థులు అడ్డగించి రౌడీషీటర్ కళ్లలో కారం చల్లి హొసూరు- బెంగళూరు జాతీయ రహదారిపై తరిమి తరిమి మారణాయుధాలతో హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ సంఘటన హొసూరు సిప్‌కాట్ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాలకు వెళితే.. బెంగళూరు బానసవాడికి చెందిన రౌడీషీటర్ విజయ్‌కుమార్ (40) కు అదే ప్రాంతంలోని మరో రౌడీ కుట్టి అనే తిరుకుమారన్‌కు గత 10 ఏళ్లుగా విభేదాలున్నాయి. రెండేళ్ల క్రితం కుట్టి అనుచరున్ని విజయ్‌కుమార్ దారుణంగా నరికి చంపాడు. దీంతో విజయ్‌కుమార్‌ను హత్య చేసేందుకు కుట్టి ప్రత్నించినా అతడు దొరకలేదని కర్ణాటక పోలీసుల కథనం.
కుట్టి తనను హత్య చేస్తాడని భయపడిన విజయ్‌కుమార్ ఏడాది క్రితం తమిళనాడులోని వేలూరుకు మకాం మార్చాడు. ఇటీవలే హొసూరు అరసనట్టి గ్రామంలో ఇల్లు కొనుగోలు చేసి తన భార్య శాంతితో నివాసముంటున్నాడు. మంగళవారం సాయంత్రం బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులో జరిగిన ఓ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొని తన స్నేహితులైన ఆనేక్కల్‌కు చెందిన నంజుండ, చందాపురంకు చెందిన మంజునాథ్‌తో కలసి హొసూరుకు కారులో తిరుగు ప్రయాణమయ్యాడు.
నంజుండ, మంజునాథ్ మార్గమధ్యంలోని చందాపురంలో కారుదిగి వెళ్లిపోయారు. రౌడీషీటర్ విజయ్‌కుమార్ కారులో ఒంటరిగా వస్తుండగా, హొసూరు-బెంగళూరు జాతీయ రహదారి జూజువాడి చెక్‌పోస్టుకు దగ్గర్లో రెండు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు విజయ్‌కుమార్ కారును అడ్డగించి, కారు అద్దాలు ధ్వంసం చేశారు. తర్వాత అతని కళ్లలో కారం చల్లారు.
ఈ సంఘటనతో అప్రమత్తమైన విజయ్‌కుమార్ కారు డోర్ తెరిచి పారిపోతుండగా, ప్రత్యర్థులు అతన్ని వెంబడించి వేటకొడవళ్లతో జాతీయరహదారిపైనే దారుణంగా హత్య చేశారు. హొసూరు డీఎస్పీ గోపీ, సిప్‌కాట్ సీఐ శంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, శవాన్ని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుట్టి తన అనుచరులతో తన భర్తను దారుణంగా హత్య చేయించాడని విజయ్‌కుమార్ భార్య శాంతి సిప్‌కాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
సిప్‌కాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1989లో విజయ్‌కుమార్ ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడని, బెంగళూరులోని వివిధ పోలీస్‌స్టేషన్లలో అతనిపై 32 కేసులున్నాయని వాటిలో 5 హత్య కేసులు, 15 కిడ్నాప్ కేసులు, దారి దోపిడీ తదితర కేసులున్నాయని తమిళనాడు పోలీసులకు కర్ణాటక పోలీసులు తెలిపారు.