
కమలంలో.. ముసలం
- బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో బహిర్గతం
- పార్టీ టికెట్ దక్కలేదంటూ మాజీల అసహనం
- స్వపక్షంపై విమర్శల వెల్లువ
- మాజీ డీసీఎంపై మండిపాటు
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిృబహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల సందర్భంగాభగ్గుమంది. స్వపక్షంలోని నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను భుజస్కందాలపై వేసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్‌పై పలువురు నాయకులు తీవ్ర విమర్శలకు దిగారు. బీబీఎంపీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే 92 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను మంగళవారం రాత్రి దాదాపు 10:30 గంటలకు బీజేపీ విడుదల చేసింది. తాము సూచించిన వారికి వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని వారు పేర్కొంటున్నారు. మాజీ మంత్రి సోమణ్ణ, పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ సైతం ఈ విషయంలో ఆర్.అశోక్ వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్నారు.
సోమణ్ణ మరో అడుగు ముందుకు వేసి ఆర్.అశోక్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్థానికంగా పార్టీ పటిష్టతకు కృషి చేసిన కార్యకర్తలకు కాకుండా ఆయన చుట్టూ తిరుగుతున్న వారికి, మాజీ కార్పొరేటర్ల భార్యలకు టికెట్లు కేటాయించారని అసంతృప్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ పార్టీ పెద్దలకు ఓ నివేదిక పంపడానికి సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి వారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎదురైన అనుభవాల దృష్ట్యా తర్వాతి అభ్యర్థుల జాబితా వెల్లడి సందర్భంగా ఎలాంటి అసమ్మతి చెలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమల నాథులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా వార్డులోని పార్టీ మద్దతుదారులతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశాలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రచారానికి దూరంగా బీఎస్‌వై!
మొదటి జాబితా విడుదలైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 9 మంది పేర్లు సూచించగా అందులో ఒక్కరికి కూడా మొదటి జాబితాలో చోటు దక్కకపోవడమే యడ్డీ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. కనీసం రెండో జాబితాలోనైనా తాను సూచించిన వారికి టికెట్టు ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. లేదంటే ఈ బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ఆయన హెచ్చిరించినట్లు సమాచారం.