చిన్ను అంటే కావేరికి ప్రాణం.. అందుకే..?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లా జుంజర్‌వాడిలో బోరు బావిలో పడి మరణించిన కావేరి (6) కోసం తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లుతుంటే, చిన్నారి పెంచిన శునకం (చిన్ను) కూడా రోదిస్తూ విశ్వాసాన్ని చూపుతోంది. శనివారం సాయంత్రం బాలిక బోరుబావిలో పడగా, సోమవారం అర్ధరాత్రి బాలిక మృతదేహాన్ని వెలికితీయడం తెలిసిందే.
మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో కావేరీని ఖననం చేయగా, చిన్నారి పెంచుకున్న కుక్క బాలిక సమాధి స్థలం చుట్టూ తిరుగుతూ అరుస్తోంది. ఖననం తరువాత అందరూ వెళ్ళిపోగా, చిన్ను మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాధి వద్దే ఉంది. సమాధిపై ఉన్న మట్టిని కాళ్లతో తీయడం, అరడం చేస్తోంది. కొంతసేపు అటుఇటు తచ్చాడి మళ్లీ సమాధి వద్దకే వస్తుంది.
మూగజీవి ప్రేమను చూసిన ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కావేరి బోరు బావిలో పడినప్పటి నుంచి బయటికి తీసే వరకు మూడ్రోజుల పాటు చిన్ను అక్కడే ఉంది. అక్కడ వేల సంఖ్యలో గుమిగూడిన ప్రజలు కుక్కను రాళ్లతో కొట్టినా వెళ్లలేదు. చిన్ను అంటే కావేరికి ప్రాణమని, ఏడాది కిందట చిన్న పిల్లగా ఉన్న చిన్నును చేరదీసి పెంచిందని చిన్నారి మామ మహాదేవ తెలిపారు.