
బెంగళూరు : బైక్ పై వెళ్తున్న యువతిని సరైన డ్రెస్ ధరించలేదంటూ ఓ వ్యక్తి దూషించాడు. ‘నువ్వు భారతదేశ పద్దతులు పాటించాలి. సరైన దుస్తులు ధరించాలి’ అంటూ యువతి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 28 ఏళ్ల టెకీ హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఆమె అదే లే అవుట్‌కు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. వారిద్దరు తిరిగి బైక్‌పై వస్తుండగా.. పక్కన వేరే బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఆమెను దూషించడం మొదలుపెట్టాడు. నీకు ఇంటి దగ్గర దుస్తులు లేవా అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి బాయ్‌ఫ్రెండ్ బైక్‌ను పక్కకు నిలిపివేసి.. అవతలి వ్యక్తిని కూడా అడ్డగించాడు. ఆ తర్వాత అతని మాటాలను వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఈ విషయం గమనించిన ఆ వ్యక్తి సైలెంట్ అయ్యాడు. తను చేసిన పనిని సమర్ధించుకునేందుకు యత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ఆ యువతి మాట్లాడుతూ.. ‘ షాపింగ్‌కు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ఎవరో పక్కన అరుస్తున్నట్టు వినిపించింది. దీంతో నేను వెనక్కి తిరిగి చూడగా వేరే బైక్‌పై వెళ్తున్న అదే పనిగా నన్ను దూషిస్తున్నాడు. ఇంట్లో సరైన దుస్తులు లేవా అంటూ నన్ను ప్రశ్నించాడు. దీంతో నీ సమస్య ఏమిటని నేను అతన్ని అడిగాను. భారత మహిళలు ఇలాంటి దుస్తులు ధరించరు అంటూ సమధానం ఇచ్చాడు. నేను ఆ సమయంలో టీ-షర్ట్, షార్ట్ ధరించి ఉన్నాను.. అందులో తప్పేముందో అర్థం కావడం లేదు. ఆ తర్వాత నా బాయ్‌ఫ్రెండ్ కూడా అతన్ని ప్రశ్నించాడు.
అయితే మేము దీనిని వీడియో తీస్తున్నామని గమనించిన అతడు కొద్దిగా వెనక్కి తగ్గాడు. కానీ ఇలాంటి దుస్తులు ధరించవద్దని చెప్పడం మాత్రం ఆపలేదు. దీంతో నా బాయ్‌ఫ్రెండ్ అన్నాడు. మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పే హక్కు అతనికి లేదని అన్నాడు. ఆ వ్యక్తి కేవలం మమ్మల్ని భయపెట్టడానికే ఇలా చేసి ఉంటాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాను.. కానీ వారు నాకు మద్దతుగా ఉండరని ఆగిపోయాను. ఎందుకంటే పోలీసులు అతనిలాంటి ఆలోచనలతోనే ఉంటారు. మేము దీనిపై ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కూడా వేరే దుస్తులు ధరించమని చెప్తారు. అందుకే నేను ఫిర్యాదు చేయలేద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment