
మల్టీస్టారర్ చిత్రంలో భరత్
నాతో ఆడుకో అంటూ సవాల్ విసరడానికి సిద్ధం అవుతున్నారు నటుడు భరత్. కాదల్ చిత్రం నుంచి సోలో హీరోగా వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన ఈ యువ నటుడు ఇటీవల కాస్త గాడి తప్పారనే చెప్పాలి. భరత్ కిప్పుడొక హిట్ చాలా అవసరం. ఆయన తాజా చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో మరో హీరోగా కదిర్, హీరోయిన్లుగా సంచిత శెట్టి, చాందిని నటిస్తున్నారు. మంచి మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న ఈ చిత్రానికి ఎన్నోడు విళైయాడు అనే టైటిల్‌ను నిర్ణయించారు.
నూతన దర్శకుడు అరుణ్‌కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది వైవిధ్యభరిత కథాంశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అన్నారు. ప్రేమ సన్నివేశాలు, హాస్యం అంటూ జనరంజకమైన అంశాలన్నీ ఉంటాయన్నారు. పలు ట్విస్ట్‌లతో కూడిన ఈ చిత్రం షూటింగ్‌కు ఇటీవలే పాండిచ్చేరిలో ప్రారంభించి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.