గవర్నర్‌ను రీకాల్ చేయాలి : బీజేపీ డిమాండ్ | bjp deamnds to recall governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను రీకాల్ చేయాలి : బీజేపీ డిమాండ్

Published Sat, Feb 1 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

bjp deamnds to recall governor


 ముంబై: ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును గవర్నర్ శంకర నారాయణన్ తిరస్కరించడంపై బీజేపీ మండిపడింది. అతడిని వెంటనే రీకాల్ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అసలు సీబీఐ అభ్యర్థనను గవర్నర్ ఎందుకు తిరస్కరించారో బహిర్గతపరచాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. యూపీఏ సర్కారు పాలనలో బయటపడిన పలు కుంభకోణాలపై చర్చించేందుకు బీజేపీ చార్జిషీట్ కమిటీ నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశానికి ఆయన శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
 
  మాజీ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వకపోవడం వెనుక గవర్నర్‌పై ఒత్తిడి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికలో చవాన్‌పై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ విచారణకు గవర్నర్ ఒప్పుకోకపోవడంలో ఔచిత్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తాము ఈ విషయమై త్వరలోనే రాష్ట్రపతిని కలిసి మాజీ ముఖ్యమంత్రిపై విచారణకు గవర్నర్ ఆమోదించేలా విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే గవర్నర్‌ను వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కుంభకోణంలో ఉన్న సంబంధాలను బహిర్గతపరుస్తామని ఆయన నొక్కిచెప్పారు. కాగా, కుంభకోణంలో మాజీ సీఎం పాత్రపై ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమవ్వడంతో గవర్నర్ అతడిపై విచారణకు తిరస్కరించారు. అంతకుముందు చవాన్ పేరును నిందితుల చిట్టా నుంచి తొలగించేందుకు సీబీఐ చేసిన అభ్యర్థనను ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాల కంటే యూపీఏదే అత్యంత అవినీతిమయ పాలన అని ప్రసాద్ విమర్శించారు. కాగా, ప్రసాద్‌తోపాటు సమావేశానికి హాజరైన వారిలో లోక్‌సభలో బీజేపీ డిప్యూటీ నాయకుడు గోపీనాథ్ ముండే, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement