shankar narayanan
-
మరో ఐదేళ్లూ మేమే!.
* మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం చవాన్ ధీమా * ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగం * గత పదిహేనేళ్ల అభివృద్ధి పనుల ఏకరువు ముంబై: మరోసారి తామే అధికారంలోకి వస్తామని, మరో ఐదేళ్లూ రాష్ట్రాన్ని తామే పాలిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ శంకర్ నారాయణన్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉభయసభల సంయుక్త సమావేశంలో చవాన్ ప్రసంగించారు. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలే చిట్టచివరివి కావడంతో సీఎం చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత పదిహేనేళ్లలో ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎఫ్ కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి పనులను ఏకరువు పెట్టారు. తాము చేసిన అభివృద్ధే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినంతమాత్రాన కేంద్రం నుంచి నిధులు తరలిరావని, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత పదిహేనేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తాము సాధ్యమైనన్ని ఎక్కువ నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఆలోచన కూడా గత బీజేపీ-శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం చేయలేదని ఎద్దేవా చేశారు. అయితే ప్రకృతి విపత్తులు, అకాశ వర్షాలు, వడగండ్లు వ్యవసాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, గత రెండేళ్లలో రైతులకు పరిహారం,వారికి లబ్ధి చేకూర్చే పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పరి హారాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చే యడం ద్వారా పూర్తి పారదర్శకతను పాటించామని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని, ఇచ్చిన పరిహారం కూడా రైతుల చేతుకు అందలేదని, తమ హయాంలో రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని లక్ష రూపాయల వరకు పెంచామని, వ్యాపార, పారిశ్రామిక రంగాాలను అభివృద్ధి చేసేందుకు ముంబై-ఢిల్లీ పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి పూర్తి చొరవ తీసుకున్నామని చెప్పారు. -
వికలాంగుల బోగీల్లో ప్రయాణించే పోలీసులపై కఠిన చర్యలు: గవర్నర్
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో వికలాంగుల కోసం కేటాయించిన బోగీలలో రైల్వే పోలీసులు ప్రయాణించవద్దని గవర్నర్ శంకర్ నారాయణన్ హెచ్చరికలు జారీ చేశారు. వికలాంగులు, క్యాన్సర్ రోగులకు కేటాయించిన బోగీలలో ప్రయాణించిన పోలీసులపై ఇకమీదట కఠిన చర్యలు తీసుకోనున్నారు. వికలాంగుల బోగీలలో ప్రయాణించడాన్ని నిషేధించినప్పటికీ వారు పలు మార్లు పట్టుబడినట్లయితే అరెస్టు చేయడానికి కూడా వెనుకాడమన్నారు. 2013 ఆగస్టు 27వ తేదీన ఈ అంశాన్ని సామాజిక సంక్షేమ శాఖ మంత్రితో కూడా చర్చించామని, తర్వాతే తీర్మానించామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. సామాజిక కార్యకర్త నితిన్ గైక్వాడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఈ విషయమై తాను పోరాటం చేస్తున్నానన్నారు. అయినప్పటికీ పోలీసు శాఖ ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. తాను ఇటీవల ప్రత్యక్షంగా చూసిన ఓ సంఘటనను వివరించారు. ఇటీవల ఓ ప్రయాణికుడు వికలాంగులకు కేటాయించిన బోగీలో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసు కూడా ఉన్నాడనీ, అయితే పోలీసుపై ఎలాంటి చర్య తీసుకోకుండా మరో ప్రయాణికుడిని అరెస్టు చేశారని గైక్వాడ్ పేర్కొన్నారు. 2013 నవంబర్‌లో పుణే కోర్టు కూడా వికలాంగులకు సంబంధించిన అంశంపై నిఘా ఉంచాల్సిందిగా అప్పటి కమిషనర్ సత్యపాల్ సింగ్‌ను ఆదేశించింది. దీంతో వికలాంగుల బోగీలలో ప్రయాణించవద్దని సింగ్ పోలీసులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లు పోగొట్టుకున్న మరో కార్యకర్త సమీర్ జావేరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ... వికలాంగులకు కేటాచించిన బోగీలలో ప్రయాణించిన వారిని ఇండియన్ రైల్వే చట్టం, 155 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జరిమానా కూడా విధించడం ద్వారానే పోలీసులు ఈ బోగీలలో ప్రయాణించడాన్ని మానుకుంటారని, దీనికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. అయితే జనరల్ బోగీలలో ప్రయాణించడం పోలీసులకు కష్టంగా మారడంతో వికలాంగుల బోగీలను ఎంచుకుంటున్నారని, దీంతో వికలాంగులకు కష్టమవుతోందని చెప్పారు. ఇదిలావుండగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(జీఆర్పీ) దీపక్ దేవ్‌రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనిఖీల నిమిత్తమే పోలీసులు రిజర్వ్ చేసిన బోగీలలో ఎక్కుంతుంటారని, కానీ సౌకర్యంగా ఉంటుందనే పోలీసులు ఈ బోగీలలో ప్రయాణిస్తున్నారని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నారన్నారు. అయితే తాను ఇప్పటి వరకు గవర్నర్ నోటీసు చదవలేదని, తనకు ఈ విషయమై ఎలాంటి అవగాహన లేదని, దీనిపై తాను ఎలాంటి కామెంట్స్ చేయదల్చుకోలేదన్నారు. -
గవర్నర్‌ను రీకాల్ చేయాలి : బీజేపీ డిమాండ్
ముంబై: ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును గవర్నర్ శంకర నారాయణన్ తిరస్కరించడంపై బీజేపీ మండిపడింది. అతడిని వెంటనే రీకాల్ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అసలు సీబీఐ అభ్యర్థనను గవర్నర్ ఎందుకు తిరస్కరించారో బహిర్గతపరచాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. యూపీఏ సర్కారు పాలనలో బయటపడిన పలు కుంభకోణాలపై చర్చించేందుకు బీజేపీ చార్జిషీట్ కమిటీ నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశానికి ఆయన శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వకపోవడం వెనుక గవర్నర్‌పై ఒత్తిడి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికలో చవాన్‌పై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ విచారణకు గవర్నర్ ఒప్పుకోకపోవడంలో ఔచిత్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తాము ఈ విషయమై త్వరలోనే రాష్ట్రపతిని కలిసి మాజీ ముఖ్యమంత్రిపై విచారణకు గవర్నర్ ఆమోదించేలా విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే గవర్నర్‌ను వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కుంభకోణంలో ఉన్న సంబంధాలను బహిర్గతపరుస్తామని ఆయన నొక్కిచెప్పారు. కాగా, కుంభకోణంలో మాజీ సీఎం పాత్రపై ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమవ్వడంతో గవర్నర్ అతడిపై విచారణకు తిరస్కరించారు. అంతకుముందు చవాన్ పేరును నిందితుల చిట్టా నుంచి తొలగించేందుకు సీబీఐ చేసిన అభ్యర్థనను ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాల కంటే యూపీఏదే అత్యంత అవినీతిమయ పాలన అని ప్రసాద్ విమర్శించారు. కాగా, ప్రసాద్‌తోపాటు సమావేశానికి హాజరైన వారిలో లోక్‌సభలో బీజేపీ డిప్యూటీ నాయకుడు గోపీనాథ్ ముండే, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు. -
ప్రజాస్వామ్యానికి శ్రేయోదాయకం
ముంబై: ఇటీవల ముగిసిన వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని గవర్నర్ శంకర నారాయణన్ పేర్కొన్నారు. స్థానిక రవీంద్ర నాట్యమందిర్లో బుధవారం జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిజం, శాసనసభ, న్యాయవ్యవస్థ, పరిపాలనా రంగాలలో తమ సత్తా చాటుకున్న వారికి ఆర్యచాణక్య పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత భారీసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం ప్రజాస్వామ్య వికాసానికి దోహద పడుతుందన్నారు. గడచిన 66 సంవత్సరాల కాలంలో దేశంలోప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమైందన్నారు. పాలనారంగంలోకి యువత అడుగుపెడితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పరిఢవిల్లుతుందన్నారు. కాగా ఈ పురస్కారాలను అందుకున్నవారిలో అమరావతి జిల్లాలోని అచలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బచ్చు కడూ, లోక్మత్ సంపాదకుడు సురేష్ ద్వాదశివార్,పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీకర్ పరదేశి, అడ్వొకేట్ దారియస్ ఖంబాటా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కిం గవర్నర్ శ్రీనివాస్ పాటిల్, స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ తదితరులు పాల్గొన్నారు.