మరో ఐదేళ్లూ మేమే!.
* మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం చవాన్ ధీమా
* ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగం
* గత పదిహేనేళ్ల అభివృద్ధి పనుల ఏకరువు
ముంబై: మరోసారి తామే అధికారంలోకి వస్తామని, మరో ఐదేళ్లూ రాష్ట్రాన్ని తామే పాలిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ శంకర్ నారాయణన్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉభయసభల సంయుక్త సమావేశంలో చవాన్ ప్రసంగించారు. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలే చిట్టచివరివి కావడంతో సీఎం చేసిన ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత పదిహేనేళ్లలో ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎఫ్ కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి పనులను ఏకరువు పెట్టారు. తాము చేసిన అభివృద్ధే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినంతమాత్రాన కేంద్రం నుంచి నిధులు తరలిరావని, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత పదిహేనేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తాము సాధ్యమైనన్ని ఎక్కువ నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఆలోచన కూడా గత బీజేపీ-శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం చేయలేదని ఎద్దేవా చేశారు. అయితే ప్రకృతి విపత్తులు, అకాశ వర్షాలు, వడగండ్లు వ్యవసాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, గత రెండేళ్లలో రైతులకు పరిహారం,వారికి లబ్ధి చేకూర్చే పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
పరి హారాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చే యడం ద్వారా పూర్తి పారదర్శకతను పాటించామని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని, ఇచ్చిన పరిహారం కూడా రైతుల చేతుకు అందలేదని, తమ హయాంలో రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని లక్ష రూపాయల వరకు పెంచామని, వ్యాపార, పారిశ్రామిక రంగాాలను అభివృద్ధి చేసేందుకు ముంబై-ఢిల్లీ పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి పూర్తి చొరవ తీసుకున్నామని చెప్పారు.