అనుకున్నదే అయింది..!
రిస్ట్ వాచీ వ్యవహారంపై దద్దరిల్లిన ఉభయసభలు
మౌనం వహించిన సీఎం సిద్ధు
ప్రతిపక్షాల ముప్పేట దాడి
ఈశ్వరప్ప ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు
భారతరత్న విశ్వేశరయ్య, దివంగత నిజలింగప్పలను ఆదర్శంగా తీసుకోవాలి అంటూ హితవు
సమయాన్ని మింగేసిన సీఎం సిద్ధు వాచ్!
సభ నేటికి వాయిదా
సాక్షి, బెంగళూరు:అనుకున్నదే జరిగింది... ‘గిఫ్ట్ వాచీ’ వ్యవహారం ఉభయసభలను కుదిపేసింది. విపక్షాలు అధికార పార్టీపై ముప్పేట దాడి చేశాయి. వివరణ ఇచ్చుకోవడంతో అధికార పార్టీ వ్యూహం ఫలించలేదు. అత్యంత విలువైన చట్టసభల సమయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డైమండ్ వాచ్ మింగేసింది!. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, విద్యుత్ తదితర సమస్యల పై ఒక్క నిమిషమైనా చర్చ జరగకుండానే సమావేశాల్లో రెండోరోజైన మంగళవారం గడిచిపోయింది. ఫిబ్రవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో రెండోరోజైన మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఉదయం 11 గంటలకు వేర్వేరుగా ప్రారంభమయ్యాయి.
ఉభయ సభల్లోనూ ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీవేత్తలతో పాటు సియాచిన్‌లో కురిసిన హిమపాతంలో చిక్కుకుని ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులు అర్పించారు. అటుపై శాసనసభలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, శాసనమండలిలో అధ్యక్షుడు శంకరమూర్తి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు జవాబులు ఇవ్వాలని (ప్రశ్నోత్తరాల సమయం) సూచించారు. అయితే శాసనమండలిలో విపక్షనాయకుడైన కే.ఎస్ ఈశ్వరప్ప లేచి ‘ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విదేశాల్లో ఉన్న ఒక వ్యక్తి ఖరీదైన వాచ్‌ను తనకు గిఫ్ట్‌గా ఇచ్చారు.’ అని బహిరంగంగా ఒప్పుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఇచ్చారు? అన్న విషయంపై చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇందుకు అధికారపక్ష నాయకుడు ఎస్.ఆర్ పాటిల్‌తో పాటు ఆ పార్టీ సభ్యులందరూ అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ నాయకులైన యడ్యూరప్ప, సదానందగౌడతోపాటు ప్రధాని నరేంద్రమోదీలు ఖరీదైన వాచ్‌లు, సూట్‌లలో ఉన్న ఫొటోలను ప్రదర్శించి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సమయంలో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీలు బీజేపీ సభ్యులకు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా ఆ పార్టీకు చెందిన సీనియర్ ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి ‘సభాపతి శంకరమూర్తి విపక్షనాయకుడు ఈశ్వరప్పకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు.
అయితే విపక్షాలు ఆయన్ను మాట్లాడనీయకుండా అడ్డుకున్నాయి. ఇది ఎమ్మెల్సీ సభ్యుడికి ఉన్న హక్కును హరించడమే అవుతుంది.’ అని పేర్కొన్నారు. అయినా పట్టువిడవని అధికార పక్షం నాయకులు కే.ఎస్ ఈశ్వరప్ప ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటూ వచ్చారు. పరిస్థితిని అదుపుచేయడానికి సభను రెండు సార్లు వాయిదా వేసినా ప్రయోజనం లేకపోయింది. బీజేపీ, జేడీఎస్ సభ్యులు కే.ఎస్ ఈశ్వరప్పకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందేనంటూ వెల్‌లోకి దూసుకువచ్చి నిరసనకు దిగడంతో సభను యథావిధిగా జరపలేమని భావించిన శంకరమూర్తి నేటి (బుధవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా ఆత్మావలోకనం చేసుకోవాలి...
శాసనసభలో కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డైమండ్ వాచ్ వివాదం ప్రతిధ్వనించింది. ఈ విషయమై చర్చకు అనుమతివ్వాల్సిందగా విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ పట్టుబట్టారు. అయితే సిద్ధరామయ్య వాచ్ ధరించడం చాలా చిన్న విషయమని...దీనిపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బెంగళూరు నగరాభివృద్ధిశాఖ మంత్రి కే.జే జార్జ్ ఎదురుదాడికి దిగారు. ఇంతలో శాసనసభలోని మంత్రులతోపాటు కాంగ్రెస్ శాసనసభ్యులు రాష్ట్ర బీజేపీ నాయకులు వివిధ సందర్భాల్లో ధరించిన ఖరీదైన వాచ్‌ల ఫొటోలను ప్రదర్శించారు. అయినా వెనక్కుతగ్గని జగదీశ్ శెట్టర్ సీఎం సిద్ధరామయ్య వ్యక్తిగతంగా ఎంత ఖరీధైన వాచ్‌ను ధరించినా తమకు అభ్యంతరం లేదన్నారు.
అయితే ప్రజల ఓట్లతో ఎన్నుకోబడిన నాయకులు లక్షల విలువ చేసే వాచ్‌లు ధరించడం ఎంత వరకూ సమంజసమో చెప్పాలని నిలదీశారు. ‘రూ.5 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను బహుమతి రూపంలో ప్రజాప్రతినిధులు తీసుకోకూడదన్న నిబంధన ఉంది. ఒక వేళ తీసుకున్నా అందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్ కలుగజేసుకుని...‘ఖరీదైనా వస్తువులను గిఫ్ట్‌గా ఇచ్చే వారు అంతేకంటే ఎక్కువ విలువైన పనులను చేయించుకోవాలని చూస్తారు. ఇది సహజం.
ఒకవేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శక్తి ఉంటే ఈ వాచ్‌కు సంబంధించిన వివాదం నుంచి బయటపడుతారు. ప్రజాప్రతినిధులమైన మనమంతా ఆత్మావలోకనం చేసుకోవాలి. నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాచ్ గిఫ్ట్‌గా వచ్చినప్పుడు ఆయన తీసుకోలేదు. ఇక భారత రత్న విశ్వేశరయ్య తనతో ఎప్పుడూ రెండు పెన్నులను ఉంచేకునే వారు. ఒకటి ప్రభుత్వ కార్యకలాపాలకు మరొకటి సొంత పనులకు ఉపయోగించేవారు. ఈ విషయాలను మనం సదా స్మరిస్తూ ఆచరించాలి. అయితే రాష్ట్రంలో ప్రజలు పలు సమస్యలతో బాధపడుతున్న సమయంలో వాటిపై చర్చించాలి కాని వాచ్‌లపై చర్చిస్తే ప్రజల దృష్టిలో చులకనైపోతాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వెండికుర్చీను శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను...
వాచ్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే బయటి నుంచి శాసనసభలోకి వచ్చిన జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామిని ఉద్దేశిస్తూ స్పీకర్ కాగోడు తిమ్మప్ప మాట్లాడారు. ‘మీకు వెండి కుర్చీ గిఫ్ట్‌గా వచ్చింది కదా? దాన్ని ప్రభుత్వానికి అప్పగించారా?’ అంటూ ప్రశ్నించారు. ఇందుకు కుమారస్వామి సమాధానమిస్తూ నాకు గిఫ్ట్‌గా వచ్చిన వెండికుర్చీని సిద్ధగంగ మఠం పీఠాధిపతి శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను.’ అని సమాధానమిచ్చారు. ఇందుకు మంత్రిమండలి అనుమతి పొందారా? అని ప్రశ్నించగా ‘నాకు గిఫ్ట్ ఇచ్చే సమయంలో వేదికపై ఉన్న సభ్యుల అనుమతి తీసుకుని శివకుమార్ స్వామీజీకి ఇచ్చాను.’ అని కుమారస్వామి సమాధానమిచ్చారు.
ఇదిలా ఉండగా చర్చ జరుగుతున్నంత సేపు శాసనసభలో దాదాపు గంటన్నర మౌనంగా కుర్చొన్న సిద్ధరామయ్య అనంతరం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ పొందలేదని ఈ విషయమై విపక్షాలు అనవసర ఆందోళన చేస్తున్నాయన్నారు. దీంతో సభలో తిరిగి కలాకలం మొదలైంది. విపక్షసభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప శాసనసభను నేటి(బుధవారం) ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.