సాక్షి, బెంగళూరు : కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం వరకూ వదిలేది లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ‘కావేరి జలాల’ కేసు విచారణలో భాగంగా తమిళనాడుకు శనివారం నుంచి రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పన ఈనెల ఆరు వరకూ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం అఖిల పక్షం నిర్వహించి ఆయన అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మంత్రి మండలి సమావేశం నిర్వహించి అందులో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
‘ఈనెల 3న (సోమవారం) ఉభయసభల సమావేశం నిర్వహించనున్నాం. అటుపై మాత్రమే నీటి విడుదల చేసే విషయమై నిర్ణయం తీసుకోనున్నాం. అంతేకాకుండా ఈనెల 23న జరిగిన ఉభయసభల సమావేశంలో కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు జలాశయాల్లో 27.2 టీఎంసీల నీరు మాత్రం ఉండేది. అందువల్ల అప్పుడు ఆ నీటిని తాగునీటికి మాత్రమే వాడాలని ఉభయ సభలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం నీటి లభ్యత 32.7 టీఎంసీలకు పెరిగింది. అందువల్ల పెరిగిన నీటిని కర్ణాటకలోని రైతులకు సాగుకోసం వదలాలా లేదా అన్న విషయంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నాం. కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో పునఃపరిశీలన అర్జీ వేయనున్నాం.’ అని పేర్కొన్నారు.
అఖిల పక్షంలో కూడా అదే మాట...
అఖిల పక్షలో ఒక్కరూ కావేరి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడుకు వదలకూడదని తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. కాగా, సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కావేరి నీటి నిర్వహణ మండలి విషయంలో బీజేపీ నాయకులు కర్ణాటకలో ఒక రకంగా, ఢిల్లీలో మరోరకంగా వాదనలు చేయడమే కాకుండా ప్రధానిపై ఒత్తిడి తేవడానికి వెనుకాడుతున్నారని చిక్కోడి పార్లమెంటు సభ్యుడు ప్రకాశ్ హుక్కెరి పేర్కొనడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ సమావేశానికి అధికార కాంగ్రెస్‌కు చెందిన దాదాపు అందరు నాయకులతో పాటు పలువురు జేడీఎస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున జగదీష్‌శెట్టర్, శోభకరంద్లాజే తదితరులు పాల్గొనగా జేడీఎస్ తరఫున కుమారస్వామి, వై.ఎస్.వీ దత్త తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సుప్రీం కోర్టు సెప్టెంబర్ 30న కావేరి నీటి విడుదలతో పాటు కావేరి నీటి నిర్వహణమండలి బోర్డు విషయమై ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ పునఃపరిశీలన అర్జీ కూడా వేయనున్నామన్నా ప్రభుత్వ ప్రతిపాదనకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించనట్లు సమాచారం.
నిర్వహణ మండలి వద్దేవద్దు...
శనివారం జరిగిన అఖిల పక్షం సమావేశంలో కావేరి నీటి నిర్వహణ మండలిపైనే ఎక్కువ సేపు చర్చ జరిగింది. ఈ మండలిని ఏర్పాటు చేస్తే ప్రతి నీటి చుక్కకోసం కేంద్రం వైపు చూడాల్సి వస్తుందన్న విషయాన్ని అందరు నాయకులు ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ విషయమై సమావేశం అనంతరం మీడియాతో జగదీష్‌శెట్టర్ మీడియాతో మాట్లాడుతూ...‘కావేరి నీటి నిర్వహణ మండలి’ ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకువస్తాం. అంతేకాకుండా కావేరి నదీ జలాల పంపకం విషయంలో మధ్యవ్యర్తిత్వం వహించాల్సిందిగా కోరుతాం.’ అని పేర్కొన్నారు. ఇక వై.వీఎస్ దత్త కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కావేరి నీటిని తమిళనాడుకు వదలకూడదని తాము ప్రభుత్వానికి స్పష్టం చేశామన్నారు. అంతేకాకుండా నీటిని వదలకూడదనే విషయానికి సంబంధించి రాష్ట్రంలోని అందరు ప్రజాప్రతినిధులు సుప్రీం కోర్టులో వ్యక్తిగత అఫిడవిట్లు దాఖలు చేయాలనే సలహాకూడా ఇచ్చామన్నారు. కావేరి నిర్వహణ మండలికి కర్ణాటక తరఫున సభ్యుల పేర్లు సూచించకూడదని తెలిపారు.
నారిమన్ పై విరుచుకపడిన విపక్షాలు...
కర్ణాటక తరఫున వాదనలు వినిపిస్తున్న ఫాలీ నారిమన్ వ్యవహార శైలిపై అఖిల పక్ష సమావేశంలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో శుక్రవారం ఆయన వాదనలు వినిపించకపోవడం సరికాదన్నారు. అందువల్లే కావేరి నిర్వహణ మండలి ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు చెప్పడంతో పాటు పదేపదే కర్ణాటకకు తీర్పు వ్యతిరేకంగా వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఆయన్ను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే సీఎం సిద్ధు కలుగజేసుకుని ఈ సమయంలో ఫాలీనారిమన్‌ను తప్పించడం సరికాదన్నారు.
ప్రస్తుతం నీటి విడుదల కష్టం
Published Sun, Oct 2 2016 1:36 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement