తమిళనాడు వాహనాలపై దాడులు
బెంగళూరు(బనశంకరి) : తమిళనాడులో కన్నడిగులపై దాడులను నిరసిస్తూ నగరంలో వివిధ కన్నడ సంఘాల్లో ఆగ్రహం పెల్లుబికింది. సోమవారం కనకపుర ప్రధానరహదారిలోని సారక్కి వద్ద జయకర్ణాటక కార్యకర్తలు తమిళనాడుకు చెందిన రెండు లారీలను అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిసస్థితులు నెలకొనడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బనశంకరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన హోటళ్లు, విద్యాసంస్థలు, కార్యాలయాలపై దాడులకు దిగారు. జయనగరలో తమిళనాడుకు చెందిన జ్యువెలరీ దుకాణాలను జయకర్ణాటక కార్యకర్తలు మూసివేయించారు.
తుమకూరు : తమిళనాడు వాహనాలపై కన్నడ పోరాట సంఘాలకు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేస్తుండంతో తుమకూరులో ముందు జాగ్రత్తగా పోలీసులు తమిళనాడు ప్రాంతాలకు చెందిన సుమారు 15 నుంచి 20 లాలీలను భారీ భద్రత మధ్య వాటిని పోలీస్ మైదానంలోకి తరలించారు. తమిళనాడులో కన్నడిగులపై దాడులను నిరసిస్తూ తుమకూరు సమీపంలోనిన కన్నడ పోరాట సంఘాలకు చెందిన కార్యకర్తలు జాతీయ రహదారి బాలాజీ రబ్బర్ ఫ్యాక్టరీ వద్ద నిలిపిన తమిళనాడుకు చెందిన లారీకి నిప్పు పెట్టి పలు వాహనాలను రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కృష్ణరాజపుర: కావేరి నదీ జలాల పంపిణీలో మరోసారి సుప్రీంకోర్టులో రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడటంతో పాటు తమిళనాడులో కన్నడిగులపై తమిళులు దాడులకు పాల్పడటంతో ఆగ్రహం చెందిన కర్ణాటక రక్ష ణ వేదిక (కరవే) స్వాభిమాని కార్యకర్తలు తమిళనాడుకు చెందిన మూడు వాహనాలపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో కే.ఆర్.పురలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
యలహంక: తమిళనాడులో నివాసముంటున్న కన్నడిగులపై తమిళులు దాడులకు పాల్పడుతుండటంతో పాటు మరోసారి కావేరి నదీ జలాల పంపిణీలో కర్ణాటకకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో ఆగ్రహం చెందిన సువర్ణ కర్ణాటక జనశక్తి వేదిక కార్యకర్తలు సోమవారం యలహంకలోని పుట్టెనహళ్లి వద్ద తమిళనాడుకు చెందిన వాహనాలపై దాడులకు పాల్పడ్డారు.