సీఎం ధరించినది స్మగుల్డ్ వాచీ
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప
బెంగళూరు:‘కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచీ స్మగుల్డ్‌దని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి సీబీఐతో విచారణ చేయించాల్సిన అవసరం ఉంది’ అని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్ప పేర్కొన్నారు. మైసూరులో శనివారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అసెంబ్లీలో మీరు వాచీ విషయంపై చర్చకు పట్టుబట్టారు కదా అన్న విలేకరుల ప్రశ్నకు యడ్యూరప్పపై విధంగా సమాధానం ఇచ్చారు. సీఎం వాచీ వ్యవహారంపై తాము న్యాయపోరాటానికి సన్నద్ధం అవుతున్నామని తెలిపారు.
నిజా,నిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం చాలా గంభీరంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది కాబట్టే తమ సభ్యులు అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారన్నారు. ‘సీఎంకు స్మగుల్ గూడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సీఎం సిద్ధరామయ్య పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నమ్మకం సన్నగిల్లుతోంది. అందుకే సీఎం మర్యాద పూర్వక విందుకు కూడా సగానికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకాలేదు. అందుకే రెండో సారి సిద్ధరామయ్య విందును ఏర్పాటు చేశారు’ అని యడ్యూరప్ప విమర్శలు గుప్పించారు.