మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)ను మహాకూటమిలో చేర్చుకునే విషయమై శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)ను మహాకూటమిలో చేర్చుకునే విషయమై శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రాజ్‌ఠాక్రేతో చేతులు కలిపే విషయాన్ని బీజేపీ నేతలు ఉద్ధవ్‌తో ప్రస్తావించినప్పుడు.. ‘మహాకూటమిలో చేరే విషయమై ముందు రాజ్‌ఠాక్రే వైఖరేంటో స్పష్టం చేసుకోండి. ఈ విషయాన్ని ముందు రాజ్‌నే అడగండ’ని అన్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. నిర్ణయాన్ని రాజ్‌కే వదిలేయడం ద్వారా మహాకూటమిలో చేరే నిర్ణయాన్ని రాజ్ కోర్టులోకే ఉద్ధవ్ నెట్టారని చెప్పారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వెలువడడంతో ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ను మట్టికరిపించాలంటే ఎమ్మెన్నెస్‌ను మహాకూటమిలో చేర్చుకోవాలనే అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉద్ధవ్‌ను కలిసిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అయితే రాజ్ నుంచి ఈ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఒంటరి పోరుకే ఆయన ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెన్నెస్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. ఫలితాలపై కూడా రాజ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
దీంతో రాజ్ ఒంటరిగానే బరిలోకి దిగాలనే అభిప్రాయంతో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముంబై, నాసిక్, ఠాణే, పుణే, కల్యాణ్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెన్నెస్‌కు మంచి పట్టుంది. దీంతో ఈ స్థానాలపై ఆ పార్టీతో చర్చించి మహాకూటమిలో చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే ఎమ్మెన్నెస్‌ను మహాకూటమిలో చేర్చుకుంటే శివసేన నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందోనన్న ఆందోళన బీజేపీ నాయకుల్లో ఇప్పటిదాకా కనిపించినా ఉద్ధవ్ చేసిన తాజా వ్యాఖ్యల తర్వాత ఓ స్పష్టత వచ్చింది. మొత్తానికి మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌ను చేర్చుకున్నా తనకేమీ ఇబ్బంది లేదనే దోరణిలో ఉద్ధవ్ స్పందించినట్లు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజ్, ఉద్ధవ్‌లు కలిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయన్న అభిప్రాయంతో వారిని కలిపే బాధ్యతను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించిన విషయం తెలిసిందే.