ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటూ విద్యార్థులు, సిబ్బందిపై ఒత్తిడి చేసినందుకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం... ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు బుధవారం నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో ఇందుకు జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ర్యాన్ ఇంటర్నేషనల్... నగరంలోని పేరున్న పాఠశాలల్లో ఒకటి. ఈ పాఠశాలకు నగరవ్యాప్తంగా చాలా శాఖలున్నాయి. కాగా, బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకోవాలని విద్యార్థులు, టీచర్లపై ఈ పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ సభ్యులుగా నమోదు కాని సిబ్బందికి మార్చి నెలలో వేతనం ఇవ్వలేదని కొందరు టీచర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్కూలు డెరైక్టర్ గ్రేసీ పింటో స్పందిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని ధ్రువీకరించారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంద వ్యవహారమని ఆమె తెలిపారు. గ్రేసీ పింటో ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యద ర్శిగా ఉన్నారు.
అసలేం జరిగింది...
వసంత్ విహార్, మయూర్‌విహార్ ఫేజ్-3, రోహిణీలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూళ్లు సిబ్బందిఒక్కొక్కరికి ఓ ఫారం ఇచ్చి పది మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించాలని ఆదేశించినట్లు తెలిసింది. అంతే కాకుండా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించాలని కోరుతూ సభ్యత్వ టోల్‌ఫ్రీ నంబరును వాట్సప్ సందేశం ద్వారా పంపింది.
పాఠశాలలు రాజకీయాలకు ఆవాసాలుగా మారడం ప్రమాదం
ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టిందనే వార్తలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వివరణ కోరారు. విద్యా శాఖ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరిందని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఆ పాఠశాల యాజమాన్యం మరో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ విషయం నిజమని తేలితే స్కూలుపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పాఠశాలలు రాజకీయాలకు ఆవాసాలుగా మారడం, పిల్లలకు రాజకీయ పార్టీలో చేరమని నేర్పడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీలోనే కాదు ఏ పార్టీలోనైనా చేరవలసిందిగా విద్యార్థులకు చెప్పడాన్ని తాము వ్యతిరేస్తామని చెప్పారు.
బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటూ ఒత్తిళ్లు
Published Wed, Mar 18 2015 11:46 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM
Advertisement
Advertisement