- మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే
- ఫీజు నిర్ణయంలో మార్పు లేదు
- ఉమ్మడి సీఈటీ నిర్వహణపై సమాలోచనలు
సాక్షి,బెంగళూరు: వైద్య, దంత వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల సీట్ బ్లాకింగ్‌ను అరికడుతామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా ఏడాదికి సీట్ల కేటాయింపు, ఫీజు నిర్ణయంలో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం కోసం ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) నిర్వహించే ఆలోచన ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లో పారదర్శకత పెంచేందుకు రూపొందించిన ‘వృత్తి విద్యా కళాశాల ప్రవేశ నియంత్రణ, ఫీజు నిర్ణయం-2014’ బిల్లులో చేసిన మార్పులకు మండలిలో శుక్రవారం ఆమోదం లభించింది. రాష్ట్రంలోని 411 ప్రభుత్వ పీయూసీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.630 కోట్లు వెచ్చించనున్నామని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రగౌడ అడిగిన ప్రశ్నకు మంత్రి దేశ్‌పాండే సమాధానమిచ్చారు.
అక్రమార్కులపై చర్యలు
బీదర్ జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కోడిగుడ్ల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ రఘునాథ్ రావ్ మల్కాపుర అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉమాశ్రీ సమాధానమిచ్చారు. వారంలో మూడు రోజుల చొప్పున ప్రతి నెల 38,70,420 గుడ్లను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం రూ.1,54,81,680 వెచ్చిస్తున్నట్లు వివరించారు.
చర్చించి నిర్ణయం తీసుకుంటాం
అక్షర దాసోహ పథకంలో భాగంగా విద్యార్థులకు భోజనం వండుతున్నవారిలో ప్రధాన వంటవారికి రూ.1,700, సహాయకులకు రూ.1,600 గౌరవ వేతనాన్ని అందిస్తున్నట్లు మంత్రి కిమ్మెన రత్నాకర్ పరిషత్‌కు తెలియజేశారు. గౌరవేతనం పెంపు విషయమై సంబంధిత కేంద్ర మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వంట సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు మరణిస్తే రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.75వేలు, చిన్నపాటి గాయలైతే రూ. 30వేలు పరిహారంగా అందచేస్తునున్నటు చెప్పారు.