పీఠం నుంచి సిద్ధును దించే లక్ష్యం
పావులు కదుపుతున్న దళిత నేతలు
అధిష్టానంపై ఒత్తిడి తీసుకెళ్లేందుకు సిద్ధం
బెంగళూరు : రాష్ర్ట కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి రగులుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడమే లక్ష్యంగా కొందరు నేతలు తెర వెనుక నుంచి పావులను కదుపుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి దళితుడిని సీఎంగా నియమించాలన్న నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో దళిత వర్గానికి చెందిన ప్రముఖులు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేపీసీసీ చీఫ్ డాక్టర్ జి.పరమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. తొలుత నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఆశ అడియాసగానే ఉంది. ఇందుకు సీఎం సిద్ధరామయ్యనే ప్రధాన కారకుడిగా ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. దీంతో ‘పరమేశ్వర్ అండ్ కో’ వ్యూహం మార్చి ఏకంగా సిద్ధరామయ్యను సీఎం పీఠం నుంచి దించేచర్యలను ప్రారంభించింది. అందులో భాగంగా ఈ ఏడాది మొదట్లో రాష్ట్రంలో సీనియర్ నాయకులు, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసే సత్తా ఉన్న నాయకులుగా పేరొందిన ఎస్.ఎం కృష్ణ, మల్లికార్జున ఖర్గేతో దళిత వర్గానికి చెందిన పరమేశ్వర్ ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురావాల్సిన మార్పుల పై సుదీర్ఘంగా చర్చించారు. అప్పటి నుంచే ‘కర్ణాటకకు దళిత ముఖ్యమంత్రి’ నినాదం తెరపైకి వచ్చింది. అడపాదడపా ఎవరో ఒకరు దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని వాడుతూ సిద్ధరామయ్యకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మంగళవారం ఇది తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలోని 20 దళిత సంఘాలకు చెందిన దాదాపు100 మందికి పైగా నేతలు ఒకవేదిక పైకి వచ్చి దళిత ముఖ్యమంత్రి ఆవసరాన్ని, ఆవశ్యకత పై చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది దళిత వర్గానికి చెందిన ఓటర్లేనని సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇప్పటి వరకూ దళితులకు సరైన పదవులు లభించలేదని వారు వాపోయారు. అందువల్ల ఈసారి కచ్చితంగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే, లేదా పరమేశ్వర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకురావడానికి మార్చి చివరి వారంలో బెంగళూరులో దళిత వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో బృహత్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాలన్నింటినీ నివేదికగా తయారు చేసి సమావేశం అనంతరం పరమేశ్వర్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా హైకమాండ్‌ను కలవడానికి నేడు (బుధవారం) పరమేశ్వర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మొదట ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, అటు పై కాంగ్రెస్ పార్టీ కర్ణాటకశాఖ రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యి రాష్ట్ర రాజకీయాల పె చర్చించనున్నారు.
దళిత వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తాం
సమావేశం అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో దళిత నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి కే.శివరాం మాట్లాడుతూ... సీఎం సిద్ధరామయ్యపై తమకు వ్యతిరేకత లేదని, అయితే దళితులు ముఖ్యమంత్రి పీఠం పై కూర్చొనే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని సమర్థుడైన దళిత నాయకుడికి ఇవ్వాలని అన్నారు. ఇందుకు విరుద్ధంగా హై కమాండ్ ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీలోని దళిత వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయిస్తామని అన్నారు.
హోరెత్తిన దళిత సీఎం నినాదం
Published Wed, Feb 18 2015 2:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement