బీజాపురలో ఇరు వర్గాల ఘర్షణ
బెంగళూరు, న్యూస్‌లైన్ : దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీజాపురలో ఒక వర్గం విజయోత్సవ ర్యాలీ మత ఘర్షణలకు దారితీసింది. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రాత్రి బీజాపురలోని గాంధీ చౌక్ నుంచి బసవేశ్వర సర్కిల్‌కు ఒక వ ర్గం వారు ర్యాలీగా బయలుదేరారు.
నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తు స్వీట్లు పంచిపెట్టారు. రంగులు చల్లుకుని వేడుకగా వెళ్తున్నారు. ఇంతో మరో వర్గం వారు రంగులు చల్లరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. స్థానికులు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మాజీ మంత్రిపై కేసులు.. మూడు రోజులు నిషేధాజ్ఞలు
విషయం తెలుసుకున్న ఉత్తర విభాగం ఐజీపీ బాస్కర్‌రావు మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి జరిగిన అల్లర ్లకు కేంద్ర మాజీ మంత్రి బసవనగౌడ యత్నాల్ పాటిల్ కారణం అని ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేశామని అన్నారు. అజ్ఞాతంలో ఉన్న యత్నాల్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎం.ఆర్.పాటిల్ మంగళవారం బీజాపుర చేరుకుని ఇరు వర్గాల పెద్దలతో శాంతి చర్చలు జరిపారు. అదనపు బలగాలు మోహరించారు.