విరిగిపోతున్న రైలు బోగీల కప్లింగ్‌లు
ప్యారిస్: గూడ్స్, ప్రయాణికుల రైళ్ల బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం రైలు బోగీలను కలిపే కప్లింగ్‌లు విరిగిపోతుండడమేనని తెలుస్తోంది. కనుక కప్లింగ్‌ల పర్యవేక్షణపై రైల్వే నిర్వాహకం దృష్టి సారించడం అత్యవసరం. 10వ తేదీ వేలూరు జిల్లా, గుడియాత్తం సమీపంలో వెళుతున్న బెంగళూరు - అరక్కోణం ప్రయాణికుల రైలు ఇంజిన్ మాత్రం వేరుగా విడిపోయి పరుగులు తీసింది.
బోగీలను కలిపే కప్లింగ్‌లు విరిగిపోవడంతోనే ఈ సంఘటన సంభవించిన ట్లు విచారణలో తెలిసింది. తర్వాత రోజు 11వ తేదీ అరక్కోణం సమీపంలో, ఇనుము లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 44 బోగీలతో వెళుతున్న గూడ్స్ నుంచి నాలుగు బోగీలు పట్టాలపై నుంచి పక్కకు తప్పాయి. ఈ ప్రమాదం కూడా కప్లింగ్‌లు విరిగిపోవడం వల్లనే జరిగిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఈ విషయమై భారత రైల్వే సాంకేతిక శాఖ సూపర్‌వైజర్ల సంఘం నిర్వాహకులు ఒకరు మాట్లాడుతూ ప్రారంభ రోజుల్లో రైలు బోగీలను ఐఆర్‌ఎస్ అనబడే స్క్రూలను కప్లింగ్‌లకు ఉపయోగించారు. వీటికి పట్టు అంతగా లేకపోవడంతో ప్రమాద సమయాల్లో రైలు బోగీలు ఒకదానిపైన ఒకటి చేరే పరిస్థితి ఏర్పడుతుండేది. ఈ సంఘటనలను తప్పించే విధంగా సరకు, ప్రయాణికుల రైళ్లలో బోగీలను సెంటర్ బంపర్ కప్లింగ్‌లతో జత చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా కొన్ని సమయాలలో ఐఆర్‌ఎస్ కప్లింగ్‌లు, సెంటర్ బంపర్ కప్లింగ్‌లు రెండింటిని ఉపయోగించి బోగీలను జత చేయడం జరుగుతుంది. కప్లింగ్‌లలో చోటు చేసుకునే లోపాలను కనుగొనడం అంత సామాన్యమైన విషయం కాదు. రైలు చక్రాలు, యాక్సిల్ వంటి వాటిని అత్యాధునిక అల్ట్రా సోనిక్ పద్ధతిలో సోధనలు చేసి, పర్యవేక్షించడం జరుగుతుంది.
ఆ విధంగా కప్లింగ్‌లను తనిఖీ చేయడం కుదరదు. అయినప్పటికినీ 18 నెలలకు ఒక సారి కప్లింగ్‌లను తనిఖీ చేస్తుంటాం. అనంతరం అవసరమైన వాటిని మార్చడం వాటికి మరమత్తు లు చేస్తాం. పలు సమయాల్లో తగిన దానికంటే ఎక్కువ బరువును బోగీలలో ఎక్కించడం కూడా కప్లింగ్‌లు విరిగిపోవడానికి కారణమవుతుంది. ఒక బోగీలో 60 టన్నుల బరువును మాత్రమే ఎక్కించాల్సి ఉంది. అయితే దాని కంటే ఎక్కువగా బరువు పెరిగినట్లైతే ఈ విధంగా కప్లింగ్‌లు విరిగి, రైలు బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు సంభవిస్తాయని ఆయన వెల్లడించారు.