తమిళనాడు ప్రభుత్వ 2017–18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ నెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఆర్థికమంత్రి జయకుమార్ ఆరోజు ఉదయం
సాక్షి ప్రతినిధి, చెన్నై:తమిళనాడు ప్రభుత్వ 2017–18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ నెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఆర్థికమంత్రి జయకుమార్ ఆరోజు ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ దాఖలు చేస్తారు. గత ఏడాది డిసెంబరు 5వ తేదీన జయలలిత మరణం తరువాత అప్పటి ఆర్థికమంత్రి పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కేవలం రెండు నెలల్లోనే ఆయన పదవీచ్యుతులయ్యారు. గత నెల 16వ తేదీన ఎడపాడి పళనిస్వామి సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. 18వ తేదీన అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తరువాత బాధ్యతలు స్వీకరించారు.
పన్నీర్‌సెల్వం చూస్తున్న ఆర్థిక శాఖను సీఎం ఎడపాడి మంత్రి జయకుమార్‌కు అప్పగించారు. ఎడపాడి ప్రభుత్వ పాలన క్రమేణా గాడిన పడుతుండగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 16వ తేదీన అసెంబ్లీలో 2017–18 వార్షిక బడ్జెట్ సమావేశం జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఆర్థిక మంత్రి జయకుమార్ బడ్జెట్ ప్రవేశపెడతారని ఆయన తెలిపారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడం పూర్తికాగానే అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో జరిగే సమావేశంలో బడ్జెట్‌పై చర్చకు ఎన్నిరోజులు కేటాయించేది నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.
పన్నుల మోతకు దూరం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొంటున్న దృష్ట్యా బడ్జెట్‌లో కొత్త పన్నుల మోత ఉండకపోవచ్చని ఆశిస్తున్నారు. అంతేగాక ప్రజలను ఆకర్షించే రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిపాదించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొన్నిరోజులుగా రగలిపోతున్న హైడ్రోకార్బైడ్ పథకం అంశం, రేషన్ దుకాణాల్లో సరుకుల సరఫరా సమస్య, శ్రీలంక సముద్రతీర గస్తీ దళాల తుపాకీ కాల్పుల్లో తమిళ జాలరి హతం, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పెరుగుతున్న డిమాండ్, వ్యాట్ పన్ను పెంపుతో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు .
దుర్భరమైన కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, మృతుల రైతు కుటుంబాలకు నష్టపరిహారం వంటి అంశాలతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే పరిస్థితులు ఉన్నాయి. సీఎంగా ఎడపాడి, ఆర్థిక మంత్రిగా జయకుమార్ ఇద్దరికీ ఇది తొలి బడ్జెట్ కావడం విశేషం. జయ మరణంపై న్యాయ విచారణ కోరుతూ పన్నీర్‌సెల్వం చేపట్టిన నిరాహారదీక్షకు భారీ స్పందన రావడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే బడ్జెట్ సమావేశాన్ని అకస్మాత్తుగా ప్రకటించారని కొందరు గుసగుసలాడుతున్నారు.
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
అసెంబ్లీలో ఎడపాడి, పన్నీర్‌సెల్వం మధ్య సాగిన బలపరీక్షా సమయంలో స్పీకర్ ధనపాల్ వ్యవహరించిన తీరు గర్హనీయమని పేర్కొంటూ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ధ్వజమెత్తుతున్నారు. మార్షల్స్ ముసుగులో ఐపీఎస్ అధికారులను ప్రవేశపెట్టి ప్రతిపక్ష సభ్యులను గెంటి వేయించిన స్పీకర్‌పై రానున్న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. రానున్నది ఎంతో కీలకమైన బడ్జెట్ సమావేశం కాగా అదే సమయంలో డీఎంకే సభ్యులు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఎటువంటి చిక్కులు ఎదురవుతాయోనని స్పీకర్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.