పోలీసులకు చిక్కిన సీఎంఎస్ డ్రైవర్
Published Fri, Sep 27 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
సాక్షి, న్యూఢిల్లీ: నగదుతో సహా పరారైన ఎస్‌ఎంఎస్ (క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్) వ్యాన్ డ్రైవర్ సంజయ్ అలియాస్ సతీష్ యాదవ్‌ను కరోల్‌బాగ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చోరీ చేసిన మొత్తంలో రూ.49 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు అతడికి సహకరించిన శైలేందర్ అనే యువకుణ్ని అరెస్టు చేసినట్టు సెంట్రల్ జిల్లా డీసీపీ అలోక్‌కుమార్ తెలిపారు. ఏటీఎంలలో నగదు నింపే సంస్థ ఎస్‌ఎంఎస్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సంజయ్ బుధవారం ఉదయం 10.50 గంటల సమయంలో కరోల్‌బాగ్ ప్రహ్లాద్ మార్కెట్‌లోని యాక్సిస్ బ్యాంకులో డబ్బు నింపేందుకు సిబ్బంది లోపలికి వెళ్లడంతో మిగిలిన డబ్బుతో ద్విచక్రవాహనంపై పరారైన విషయం తెలిసిందే.
చోరీకి సంబంధించిన సమాచారం అందుకున్న కరోల్‌బాగ్ పోలీసులు వెంటనే వెంబడించి యాక్సిస్ బ్యాంక్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ నుంచి మొత్తం 83 లక్షల సొమ్ముతో బయలుదేరామని, ఫిజా రోడ్డులోని ఏటీఎంలో రూ.ఐదు లక్షలు పెట్టి, మరోదాంట్లో రూ.29 లక్షలు పెట్టేందుకు వెళ్లినట్టు వ్యాన్‌గార్డ్ పెరూ దత్తశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోటార్‌ై సెకిల్‌పై వచ్చిన వ్యక్తితో కలిసి వ్యాన్ డ్రైవర్ సంజయ్ డబ్బు పెట్టెతో పారిపోయినట్టు తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంచేయడంతోపాటు శివార్లలోని చెక్‌పోస్టులకు చోరీ సమాచారాన్ని పోలీసులు పంపారు. విష్ణుమందిర్‌మార్గ్, రాయిగఢ్‌పురా ప్రాంతంలో ఎస్‌ఎంఎస్ వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వ్యాన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన క్రైం పోలీసు బృందం నిందితుడి చిరునామా ప్రకారం ఓఖ్లాలో తనిఖీ చేశారు. కంపెనీకి అతడు ఇచ్చిన సమాచారం తప్పని పోలీసు దర్యాప్తులో తేలింది. సంజయ్‌కి గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానికంగా సమచారం సేకరిస్తూ దర్యాప్తును కొనసాగించిన పోలీసులు నిందితుడి అసలు పేరు సతీష్‌యాదవ్‌గా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ నేరానికి సహకరించిన ఇతడి స్నేహితుడు శైలేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.49 లక్షల సొమ్ము స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement