
నౌక కలకలం
సాక్షి, చెన్నై : కడలూరు-నాగపట్నం సముద్ర తీరంలో శ్రీకృష్ణ అనే నౌక కలకలం రేపింది. కడలూరు హార్బర్‌కు సమీపంలో లంగర్ వేసిన ఈ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం, మట్టిలో కూరుకు పోవడంతో పోలీసుల్లో అనుమానాలు నెలకొన్నాయి. తీవ్రవాదులు ఎవరైనా చొరబడ్డారా? అన్న ఆందోళనతో విచారణను వేగవంతం చేశారు. ఇటీవల సముద్ర మార్గంలో ఓ పడవ ద్వారా పాకిస్తానీ ముష్కరులు భారత్‌లోకి చొరబడే యత్నం చేయడం, అది మంటల్లో చిక్కుకోవడం తెలిసిందే. దీంతో సముద్ర తీరాల్లో భద్రతను పెంచారు. రాష్ట్రంలో అయితే, తిరువళ్లూరు, చెన్నై మొదలు కన్యాకుమారి వరకు సముద్ర తీరాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఘాతో వ్యవహరిస్తున్నా, శ్రీ కృష్ణ అనే ఓ నైక ఒడ్డుకు కొట్టుకు రావడం కలకలాన్ని రేపింది. నాగపట్నం, కడలూరు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉరకలు తీయించింది.
కడలూరు - నాగపట్నం సముద్ర తీరంలోని పోయనల్లూరు వద్ద శుక్రవారం రాత్రి ఓ చిన్న సైజు నౌక ఒడ్డుకు దూసుకు వచ్చింది. ఒడ్డుకు అతి వేగంగా వచ్చిన ఈ నౌక మట్టిలో కూరుకు పోయింది. దీన్ని గుర్తించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు.ఆందోళనలో పడ్డ కడలూరు, నాగపట్నం జిల్లా పోలీసు అధికారులు, మెరైన్, కోస్టు గార్డు వర్గాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ నౌకలో కెప్టెన్ అమరనాథ్‌తో పాటుగా పది మంది మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ నౌక ఒడ్డు వైపుగా దూసుకు రావడంతో తీవ్ర వాదులెవరైనా చొరబడ్డారా? అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో ఆపరిసరాల్లో కలకలం బయలు దేరింది. అదే సమయంలో ఆ నౌకను చుడటానికి జనం పరుగులు తీశారు. అనుమానాలు నెలకొనడంతో ఆ నౌక సిబ్బంది వద్ద పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.
విచారణ: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన శ్రీ కృష్ణగా ఆ నౌకను గుర్తించారు. కడలూరు తదితర చిన్న చిన్న హార్బర్లకు ఈ నౌక ద్వారా సరకులు సరఫరా అవుతున్నట్టు విచారణలో తేలింది. కడలూరు హార్బర్‌లో ఈ నౌక సరకుల్ని దించినట్టు గుర్తించారు. ఎక్కువ రోజులు ఈ నౌక కడలూరు హార్బర్‌లోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ నౌకకు మరమ్మతులు చేపట్టాల్సిన దృష్ట్యా, సూరత్‌కు తరలించే ప్రయత్నంచేశారు. దీనిని కడలూరు హార్బర్‌కు కాస్త దూరంలో లంగర్ వేసి నిలిపి ఉన్నట్టు తేలింది. కడలూరు హార్బర్‌లో తాగు నీటిని నింపుకున్న అనంతరం సూరత్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగినా, శుక్రవారం లంగర్ తెగడంతో ఈ నౌక అదుపు తప్పింది.
గాలి ప్రభావం కారణంగా నౌకను కట్టడి చేయలేక కెప్టెన్ చేతులెత్తేశారు, ఖాళీగా ఉండబట్టే ఆ నౌక ఒడ్డుకు దూసుకు వచ్చి మట్టి లో కూరుకు పోయిందని విచారణలో తేలింది. అయితే, పోలీసులు తమ అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు మరింతగా విచారణ జరుపుతున్నారు. ఆ సముద్ర తీరాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జాలర్ల గ్రామాల్లోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ నౌకను మళ్లీ సముద్రంలోకి చేర్చేందుకు కుస్తీలు పడుతున్నారు.