కర్ణాటకకు బస్సు సర్వీసులు రద్దు
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తమిళ నాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేసింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటకకు వెళ్లే అన్ని రకాల బస్సులను నిలిపివేసింది. ఆందోళనకారులు బస్సులపై దాడి చేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో జయలలిత సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చెన్నైలోని కోయంబేడులో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ఇక మరి కొన్ని బస్సులను హోసూర్ సరిహద్దులో నిలిపివేశారు.
మరోవైపు కర్ణాటక మాండ్యాలో ఆందోళనలు విస్తరిస్తున్నాయి. రైతులకు మద్ధతుగా ఇతర వర్గాలు నిరసనబాట పడుతున్నాయి. తాజాగా లాయర్లు కూడా ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐతే ఈ ర్యాలీలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నారు. కొంతమంది నిరసనకారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోస్టర్లను చింపేయడం కలకలం రేపింది. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమత్రి సిద్ధరామయ్య ఈ రోజు సాయంత్రం అఖిలపక్షంతో సమావేశం కానున్నారు.