
సీబీఐ విచారణకు ఆదేశించండి
లాటరీ, మట్కా దందాలపై సిద్ధరామయ్యను ప్రశ్నించిన హెచ్.డి.కుమారస్వామి
‘మీట్ ది ప్రెస్’లో ప్రభుత్వంపై విమర్శల వర్షం
బెంగళూరు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలనను ప్రజలకు అందజేస్తోందని సీఎం సిద్ధరామయ్య చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే రాష్ట్రంలో నడుస్తున్న లాటరీ, మట్కా దందాలపై సీబీఐ విచారణకు ఆదేశించగలరా? అని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి ప్రశ్నించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న కుమారస్వామి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. లాటరీ, మట్కా దందాలతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై సీఓడీ విచారణకు ఆదేశించారని, అయితే సీఓడీ స్థానంలో సీబీఐ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధమేనా అని కుమారస్వామి సవాల్ విసిరారు.
ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తే లాటరీ దందాలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను అందజేస్తానని అన్నారు. ఇక ఇదే సందర్భంలో లాటరీ, మట్కాలను నియంత్రించేందుకు గాను ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు దళాలను ప్రభుత్వం రద్దు చేయడం అనేక సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనక రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ఉన్నారా లేక ఆయన సలహాదారు కెంపయ్య ఉన్నారా అనే విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రెండేళ్లలో దక్కింది ‘అప్పు భాగ్య’ మాత్రమే....
ఇక సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని, అయితే ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలకు దక్కింది కేవలం ‘అప్పు భాగ్య’ మాత్రమేనని కుమారస్వామి విమర్శించారు. రెండేళ్ల పాలనపై సంతృప్తిని వ్యక్తం చేయాల్సింది ముఖ్యమంత్రో లేక మంత్రులో కాదని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేయాలని అన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికీ జేడీఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో శక్తి ఉందని కుమారస్వామి తెలిపారు.