నిడో హత్యపై సీబీఐ దర్యాప్తు
Published Wed, Feb 12 2014 12:31 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
న్యూఢిల్లీ: నగరంలో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి నిడో తానియా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నిడో తల్లిదండ్రులు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను మంగళవారం కలిసారు. వారితో భేటీ అనంతరం ఈ మేరకు షిండే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. మృతుడి తల్లిదండ్రులు ఈ కేసులో సీబీఐ దర్యాప్తును కోరారు.. అందువల్ల కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింద’ని ఆయన తెలిపారు. వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులకు తప్పక శిక్షిస్తామని మృతుడి కుటుంబానికి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు హోం మంత్రి షిండేను మృతుడు నిడో తానియా తల్లిదండ్రులు కలిసి 15 నిమిషాలపాటు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు ఈ కేసులో సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేశారు. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా నిడో తల్లి పవిత్ర( కాంగ్రెస్ ఎమ్మెల్యే, అరుణాచల్ ప్రదేశ్) మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈశాన్యవాసులు వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు. వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని తాము హోం మంత్రిని కోరినట్లు తెలిపారు.
నిడో హత్య కేసులో నలుగురి అరెస్టు
అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా హత్య కేసులో పోలీసులు నలుగురిని మంగళవారం అరెస్టు చే సినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సన్నీ ఉప్పల్, పవన్, సుందర్, ఫర్మాన్‌లను నిందితులుగా గుర్తించామ ని మేజిస్ట్రేట్‌కు విన్నవించారు. తలలో అంతర్గత గాయాలవల్లే నిడో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని చెప్పారు. కాగా, అంతకుముందు పవన్, సుందర్, ఫర్మన్‌ను ఈ నెల మూడో తేదీన పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మంగళవారం సన్నీ ఉప్పల్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈనెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కాగా నిందితులు పవన్, సుందర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు 14వ తేదీన విచారణకు స్వీకరించనుంది.
రాహుల్ గాంధీని కలిసిన
నీడో తల్లిదండ్రులు
లాజ్‌పత్‌నగర్‌లో దుకాణదారుల దెబ్బల ధాటికి మరణించిన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నీడో తానియా త ల్లిదండ్రులు మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. ఈశాన్య ప్రాంతవాసులపై వివక్షను పోగొట్టడానికి చర్యలు చేపట్టాలని వారు రాహుల్ గాంధీని కోరారు. జాతివివక్షకు వ్యతిరేకంగా బహిరంగ స్థలాలలో హోర్డింగులు, పోస్టర్లు అమర్చడానికి ప్రభుత్వానికి చేయూత నివ్వవలసిం దిగా తాను వ్యాపారవేత్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు నీడో తల్లి చెప్పారు. నీడో విషయంలో ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement