‘నా కుమార్తెను చంపేశారు’ : నిత్యానంద మరో అకృత్యం | My daughter was murdered, Ive lost everything A Nithyananda disciple mother recalls her ordeal | Sakshi
Sakshi News home page

‘నా కుమార్తెను చంపేశారు’: నిత్యానంద మరో అకృత్యం

Published Wed, Nov 27 2019 4:44 PM | Last Updated on Wed, Nov 27 2019 6:07 PM

My daughter was murdered, Ive lost everything A Nithyananda disciple mother recalls her ordeal  - Sakshi

నిత్యానంద(ఫైల్‌ ఫోటో)

సాక్షి, బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అకృత్యాలకు సంబంధించి మరో హృదయ విదారక గాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. నిత్యానంద ఆశ్రమంలో అమ్మాయిలను (శిష్యులను) భక్తి ముసుగులో లోబర్చుకోవడం, లైంగిక వేధింపులతో నరకం చూపిస్తున్నారంటూ కలకలం రేపిన ఇటీవలి కథనాలు, బాలికల మాయం ఉదంతాలు వెలు చూసిన అనంతరం ఓ బాధిత తల్లి తన గోడును మీడియా ముందు వెల్లడించారు. 2014లో నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హింసించి, దారుణంగా హత్య చేశారని ఝాన్సీ రాణి అనే మహిళ ఆరోపించారు. బిడ్డను, భర్తను కోల్పోయాను.. కుటుంబం మొత్తం సర్వ నాశనమైపోయింది. తనలాంటి దుస్థితి మరెవ్వరికీ రాకూడదు..దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు.

ఇండియా టుడే టీవీ కథన ప‍్రకారం నిత్యానంద బెంగళూరు ఆశ్రమంలో తన కుమార్తె సంగీత అర్జున్‌ను  అక్రమంగా బంధించి, హత్యచేశారని ఝాన్సీరాణి ఆరోపణ. త్రిచికి చెందిన సంగీత అర్జునన్ 2008 - 2014 కాలంలో నిత్యానంద ఆశ్రమంలో కంప్యూటర్ విభాగానికి హెడ్‌గా పనిచేసేది. మరణించే నాటికి (డిసెంబర్28, 2014) ఆమె వయసు 24 మాత్రమే. ఆశ్రమంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో సంగీత జీవిస్తున్న విషయాన్ని గమనించి ఆమెను ఇంటికి తీసుకొచ్చానని, అయితే వెంటనే నలుగురు వ్యక్తులు వచ్చి బలవంతంగా సంగీతను తీసుకెళ్లారని, పైగా ఆశ్రమనుంచి ఎత్తుకొచ్చావంటూ తనమీదే కేసు పెడతామని బెదిరించాని ఆమె పేర్కొన్నారు. ఆ తరువాత తన బిడ్డను మళ్లీ సజీవంగా చూడలేకపోయానని ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు.

ఆశ్రమంలో ఉండే హంసానంద, ప్రణయానంద ఇద్దరూ కనీసం తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతించలేదని రాణి చెప్పారు. చాలాసార్లు ఆశ్రమానికి సంగీతను కలవడానికి వెళ్లి...గంటల తరబడి గేటు ముందు వేచి చూసినా ఫలితం లేదని, చివరకు గుండెపోటుతో చనిపోయిందంటూ ఆమె మృతదేహాన్ని అప్పగించారని వాపోయారు. కచ్చితంగా తన బిడ్డను హత్య చేశారని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును చేపట్టాలని ఆమె కోరుతున్నారు.

అంతేకాదు సంగీత అంత్యక్రియలు కూడా ఆశ్రమంలోనే చేయాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యారని ఝాన్సీ రాణి చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని పట్టుబట్టడంతోనే మొదటి పోస్ట్‌మార్టం జరిగిందని ఆమె  తెలిపారు. అయితే సంగీతం మృతదేహంపై కాళ్లపై వాపు, బ్లడ్‌ క్లాట్స్‌ బంధువులు గమనించడంతో బెంగళూరులోని రాంగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతోపాటు, రెండవసారి పోస్ట్‌మార్టం కోసం పట్టుబట్టినట్టు ఆమె చెప్పారు. దీంతో ఆమె శరీరంలోని అవయవాలన్నీ మాయమయ్యాయని రెండవ పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. అయితే మొదటి శవపరీక్షలో వాటిని తొలగించినట్టు గత ఏడాది హైకోర్టు జడ్జికి తెలిపారన్నారు. కర్ణాటక కోర్టులో కేసు వేసి ఐదేళ్ళు అయ్యింది. గత ఏడాది ఈ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. కానీ ఆ తరువాత పదిరోజుల్లోనే ఆ సదరు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో విచారణలో ఎలాంటి పురోగతి లేదని, ఈ నేపథ్యంలో తక్షణమే  స్పందించి బీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

సంగీత చనిపోయిన రెండేళ్లకే కుమార్తె చనిపోయిన బాధతో కుమిలిపోయిన తన భర్త కూడా ఈ లోకాన్ని వీడారని, నిత్యానంద నిర్వాకంతో సర్వం కోల్పోయానని ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుటుంబంలో గుండెపోటు వ్యాధికి సంబంధించిన హిస్టరీ ఉన్న కారణంగా జెనెటిక్‌గా వచ్చిన గుండెపోటుతో అతి చిన్న వయసులోనే సంగీత  చనిపోయిందని ఆశ్రమ వర్గాలు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

కాగా స్వామి ముసుగులో ఆశ్రమంలో లైంగిక కార్యకలాపాలు, అత్యాచార ఆరోపణలను ఇప్పటికే ఎదుర్కొంటున్న నిత్యానందపై మరోసారి తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. అమ్మాయిలతో బలవంతపు విరాళాలు వసూలు కోసం పిల్లలను కిడ్నాప్ చేసి, తప్పుగా నిర్బంధించినందుకు నిత్యానందపై గత వారం కేసు నమోదైంది. అయితే నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని పోలీసులు  ప్రకటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement