
చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలు
చెన్నై : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నివాసంలో మంగళవారం సీబీఐ సోదాలు చేసింది. చెన్నైలో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా 14 ప్రాంతాలతో పాటు ఢిల్లీ, నోయిడాలోనూ సీఐబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపునకు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు కార్తి చిదంబరం సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంద్రాణి ముఖర్జియాకు చెందిన ఐఎన్‌ఎక్స్ మీడియాకు 2008లో దొడ్డిదారిలో అనుమతులు మంజూరుచేయించినట్టు కార్తిపై ఆరోపణలున్నాయి. ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన నేపథ్యంలో దాడులు జరుగుతున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే ఎయిర్ సెల్ , మ్యాక్సిస్ ఒప్పందాల వ్యవహారం కేసులో కార్తీ చిదంబరంపై ఆదాయపన్ను శాఖ, ఈడీ వర్గాలు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో చోటుచేసుకున్న అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.