
కావాలనే నన్ను టార్గెట్ చేశారు: చిదంబరం
రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తమపై సీబీఐ దాడులు చేయించిందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.
చెన్నై: రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తమపై సీబీఐ దాడులు చేయించిందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఎయిర్‌టెల్-మ్యాక్సిస్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నివాసాలపై సీబీఐ దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడులపై చిదంబరం స్పందిస్తూ తానేప్పుడు చట్టాన్ని ఉల్లంఘించలేదని, వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కావాలనే తనను టార్గెట్ చేశారని చిదంబరం వ్యాఖ్యానించారు. తమ గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తుల పేరుతో సీబీఐతో దాడులు చేయించి కుట్రలు చేస్తోందన్నారు.
తన కుమారుడితో పాటు అతడి స్నేహితులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని చిదంబంరం స్పష్టం చేశారు. మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్... చిదంబరం నివాసంపై సీబీఐ దాడులను ఖండించారు. రాజకీయ కక్షతోనే దాడులు నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే చిదంబరంను కేంద్రం టార్గెట్ చేసిందని, కేవలం సంచలనం రేపాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి టామ్ వడక్కన్ ఆరోపించారు.