మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ : నగరంలో మహిళలకు రక్షణ కరువైంది.అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో మరో ఘోరం జరిగింది. ముపై ఏళ్ల వైద్యురాలిపై దుండగులు మోటార్‌బైక్‌పై దూసుకొచ్చి యాసిడ్ దాడికి ఒడిగట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని రాజోరీ గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమ్రితాకౌర్‌కి పెళ్లి అయి 8 నెలలు అవుతుంది. రాజోరిగార్డెన్‌లో నివాసం ఉంటుంది.
ఉదయం టూవీలర్‌పై వెళ్తుండగా మోటార్ బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ దాడి చేసి, హ్యాండ్ బ్యాగ్ దొంగిలించారు. ఈ దాడిలో బాధితురాలి ముఖం, తలపై మంటలు వ్యాపించడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఎఐఐఎంఎస్‌కు తరలించారు. ప్రాణానికి ప్రమాదమేమీ లేదని పోలీసులు వెల్లడించారు. ఆమె పనిచేసే ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉన్న బాలీనగర్‌కు కొద్ది దూరంలోనే ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
దుండగులను శిక్షించాలి : ఆప్
న్యూఢిల్లీ : నగరంలో మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని ఆమ్‌ఆద్మీపార్టీ ఢిల్లీ కన్వీనర్ అశుతోష్ డిమాండ్ చే శారు. మంగళవారం ఆయన ఈఘటనపై మీడియాతో మాట్లాడారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి సకాలంలో కేసు విచారణ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవరిస్తే, దుండగులకు చట్టం అంటే భయం లేకుండా పోతోందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అన్నారు. తక్షణమే అన్నిచోట్ల సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, సరిపడా పోలీసు సిబ్బంది నియమించాలని అన్నారు. రాజోరీ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.