బాగ్ దిల్లీ బాగ్
Published Sun, Dec 15 2013 11:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: వారాంతాల్లో ఆలస్యంగా నిద్రలేచే రాజధాని నగరం ఆదివారం వేకువ జామున్నే పరుగు మొదలు పెట్టింది. ఎయిర్‌టెల్ హాఫ్ మారథాన్, ఆ వెంటనే బీజేపీ రన్‌ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడంతో ఆదివారాల్లో నిర్మానుష్యంగా ఉండే సెంట్రల్ ఢిల్లీ రోడ్లు కిక్కిరిశాయి. జవరహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం నుంచి ఉదయం ఏడు గంటలకు మొదలైన హాఫ్ మారథాన్‌లో ఢిల్లీవాసులు ఉత్సాహం పాల్గొన్నారు. మొత్తం 31వేల ఒక వంద మంది హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నారు. దీనిలో భారతీయులతోపాటు 309 మంది విదేశీయులు పాల్గొనడం విశేషం. విజేతకు 210,000 యూఎస్ డాలర్లు ప్రైజ్‌మనీకింద అందజేశారు. పురుషుల కేటగిరిలో ఇతోఫియాకి చెందిన టెస్గే 59 నిమిషాల 12 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు.
కెన్యాకి చెందిన ఫ్లొరెన్స్‌కి పాల్గత్ మహిళల విభాగంలో గంట ఏడు నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేసి మొదటి బహుమతి గెలుచుకున్నారు. మారథాన్‌లో పాల్గొనేందుకు వచ్చిన వందలాదిమందితో స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. మిల్కాసింగ్, నటి బిపాసబసు ప్రత్యేక అతిథులుగా పాల్గొని పరుగెత్తేవారిని ఉత్సాహపరిచారు. సంగీతానికి అనుగుణంగా మిల్కాసింగ్ కాసేపు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. పరుగుపందెంలో పాల్గొనేవారి కోసం నిర్వాహుకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పరుగుపందెం వెళ్లే మార్గాల్లో మంచినీళ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఏడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా 1,200 మంది వలంటీర్ల నియమించడంతోపాటు 25చోట్ల సీసీటీవీల కెమెరాలను ఏర్పాటు చేశారు. పరుగు విజయవంతం కావడంపై ఢిల్లీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement